పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యోబునిగూర్చి "అతడు దోషరహితుడు. ధర్మాత్ముడు. దేవునిపట్ల భయభక్తులు కలవాడు. పాపానికి దూరంగా వుండేవాడు. అలాంటివాడు మరొకడు భూలోకంలో లేడు” అని సాక్ష్యమిచ్చాడు-1,8. ఈ సందర్భంలో యోబు భార్య పెనిమిటిపట్ల ప్రలోభకారిణిగా వ్యవహరించింది. పూర్వం ఏవ ఆదామని ప్రలోభపెట్టి అతనిచేత పండు తినిపించిందని వింటున్నాం. యోబు భార్యకూడ భర్తపట్ల ఈ లోభకారిణి పాత్రనే నిర్వహించింది. కాని యోబు ఈ శోధనలన్నిటికీ తట్టుకొని తాను దైవచిత్తానికి కట్టవడి వుండేవాణ్ణని నిరూపించుకొన్నాడు.

2. యోబు సంభాషణలు

యోబు కథ ఇంతటితో ముగియలేదు. అతని శ్రమలు చాల కాలం కొనసాగాయి. ఆ ఘోరబాధల్లో తాలివి కోల్పోయి అతడు దేవునిమీద తిరగబడ్డాడు. నేను ఏ పాపమూ ఎరుగనుకదా, నీవు నన్ను ఈలా యెందుకు శిక్షిస్తున్నావో చెప్పమని దేవుణ్ణి సవాలు చేసాడు. ఈ సంఘటనని ఆధారంగా తీసికొని యోబుగ్రంథ రచయిత సజ్జనులకు బాధలెందుకు వస్తాయి అనే సమస్యకు పరిష్కారం చూపించడానికి పూనుకొన్నాడు. కనుక మనం యోబు సంభాషణలను జాగ్రత్తగా పరిశీలించి చూడాలి.

1. యోబు స్నేహితులు

యోబుకి ముగ్గురు ప్రాణస్నేహితులున్నారు. వాళ్ళు టేమాను నగరవాసియైన యెలీఫాసు, షూహాదేశీయుడైన బిల్డదు, నామాదేశీయుడైన సోఫరు. (తర్వాత నాల్గవ స్నేహితుడైన యెలీహుకూడ కన్పిస్తాడు). ఆ మిత్రులు మువ్వురు యోబు కష్టాల్లో వున్నాడని విని అతన్ని వోదార్చడానికి పయనమై వచ్చారు. వాళ్ళు యోబునిచూచి శోకించారు. అతని ప్రక్కనే నేలమీద చతికిలబడి ఏడురాత్రులూ ఏడుపగళ్ళూ మౌనంగా గడిపారు. యూదుల సంప్రదాయం ప్రకారం బాధల్లో వున్న వ్యక్తి మాట్లాడిందాకా ఓదార్చేవాళ్ళు మాట్లాడకూడదు. ఇక్కడ యోబు మౌనంగా వుండడంచేత అతని మిత్రులు కూడ వారం రోజులు మౌనంగా వుండిపోవలసి వచ్చింది-2, 12-13.

సరే, వారం రోజులయ్యాక యోబు స్నేహితులతో సంభాషణలు మొదలెట్టాడు. ఈ సంభాషణల్లో ఒక్కో స్నేహితుడూ యోబుకీ బుద్ధిమతులు చెపూండగా యోబు వాళ్ళకు ఉచితరీతిని జవాబిస్తూంటాడు. ఈలా ముగ్గురు మిత్రులచుటూ మూడు పెద్ద సంభాషణలు నడిచాయి. వీటిని క్రమంగా పరిశీలిద్దాం.