పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6. మోషే అవిశ్వాసం 20, 1=13

యిస్రాయేలీయులు కాదేషులోని సీను ఎడారికి వచ్చారు. మిర్యాము ఇక్కడే చనిపోయింది. యావే ఆజ్ఞ ప్రకారం తొలి తరంవాళ్ళంతా ఒకరితర్వాత ఒకరు చనిపోవలసిందే - 14,29.

ఈ తావులో నీళ్ళు దొరకనందున ప్రజలు మోషేమీద గొణగారు. ఈజిప్టులో వున్నపుడే బాగుంది, ఇప్పడు ఈ యెడారిలో చచ్చిపోతున్నాం అని తిరగబడ్డారు. మోషే ప్రభువుకి విజ్ఞాపనం చేయగా అతడు నీవు బెత్తం తీసుకొనిపోయి కొండబండను నీళ్ళీయమని ఆజ్ఞాపించు అని చెప్పాడు.

మోషే అహరోనులు బెత్తం తీసికొని, ప్రజలను ప్రోగుజేసికొని బండ దగ్గరికి వెళ్లారు. ప్రభువు చెప్పినట్లుగా అతడు ఆజ్ఞాపిస్తే చాలు, అది నీళ్ళిస్తుంది. కాని ఇక్కడ మోషే విశ్వాసం చలించింది. వట్టినే రాతిబండను నీళ్ళీయమంటే అది యేలా యిస్తుంది అని అతడు శంకించాడు. కనుక అతడు బండను కర్రతో బాదాడు. అదీ వొకసారి కాదు, రెండుసార్లు ఈలా దేవుని శక్తిని శంకించినందుకు దేవుడు ఆ యన్నదమ్ములను శిక్షించాడు. మీరు నా పవిత్ర శక్తిని శంకించారు కనుక కనాను దేశంలో అడుగు పెట్టరు అని చెప్పాడు. సామాన్య ప్రజలు శంకించడం ఒక యెత్తు, దేవుణ్ణి బాగా అనుభవానికి తెచ్చుకొన్న నాయకుడుమోషే శంకించడం మరొక యెత్తు, సముద్రాన్ని పాయలుగా చీల్చినవాడు, ఆకాశం నుండి ఆహారాన్ని కురిపించినవాడు రాతిబండనుండి నీళ్ళ పట్టించలేడా? మోషేకు అతని శక్తిని శంకించవలసిన అవసరం ఏమి వచ్చింది? కనుకనే ప్రభువు ఆయన్నదమ్ములను కఠినంగా శిక్షించాడు. మనం ఎంత పెద్ద పదవిలో వున్నామో మన విశ్వాసం గూడ అంత గొప్పదిగా వుండాలి. దేవుని పట్ల నేడు మనకున్న విశ్వాసం ఏపాటిది?

మోషే అవిశ్వాసం ఏలాగున్నా ప్రజల అక్కరను గుర్తించి దేవుడు బండనుండి నీళ్ళ పారించాడు. ప్రజలు వారి పశువులు ఆ నీళ్ళత్రాగి ముందుకు సాగిపోయారు.

ఆ ప్రయాణంలో హోరు పర్వతం దగ్గర అహరోను కూడ చనిపోయాడు -20, 22-29. దేవుని ఆజ్ఞను అనుసరించి తొలితరం యిస్రాయేలీయులంతా కనాను దేశాన్ని చేరక ముందే చనిపోతారు. చనిపోక ముందు అహరోను తన యాజక వస్తాలను కుమారుడైన యెలియాసరుకు కట్టబెట్టాడు. అనగా అతని యాజకత్వం కుమారునికి సంక్రమించిందని భావం. యిప్రాయేలీయులు అహరోను మృతికి నెలనాళ్ళ విలపించారు. అక్క అన్న గతించాక మోషే వొక్కడే ప్రజలను నడిపించుకొని పోయాడు. తర్వాత అతడుకూడ నెబో కొండమీద చనిపోతాడు.