మధ్యమ వ్యాయోగము 21
భీమ - దేవి! నీవు జాతిచేతమాత్రమే రాక్షసివి, సదాచారముచేతఁ గావు.
హిడింబ - పిచ్చివాఁడ తండ్రికి నమస్కారము చేయుము.
ఘటో - తండ్రి! ధార్తరాష్ట్రవనదవాగ్ని నగుఘటోత్కచుఁడను నేను నమస్కరించు చున్నాఁడను. పుత్రచాపలమును క్షమింపవలయును.
భీమ - కుమార! రమ్ము! రమ్ము! నీవు వ్యతిరేకముగఁ జేసిన దయినను మనోహరముగా నున్నది. (అని కౌఁగలించును.) కుమారా! మీతండ్రుల హృదయములు ధార్తరాష్ట్రవసదా వాగ్నులగు పుత్రులనే యపేక్షించుచున్నవి. మహాబల పరాక్రముఁడవు కమ్ము.
ఘటో - మహాప్రసాదము.
వృద్ధ - అలాగా, ఈయన భీమసేనపుత్రుఁ డగు ఘటోత్కచుఁడా?
భీమ - పుత్రక! పూజ్యుఁ డయిన యీకేశవదాసునకు నమస్కరింపుము.
ఘటో- దేవ! నమస్కరించుచున్నాఁడను.
వృద్ధ- తండ్రివలె గుణకీర్తి సంపన్నుఁడవు కమ్ము!
ఘటో - అనుగ్రహింపఁబడితిని,
వృద్ధ - ఓ వృకోదర నావంశము రక్షించి, నీకులము నుద్ధరించితివి. మే మిఁక వెళ్ళుదుము.
భీమ -
తే.గీ. నీయసుగ్రహంబు కలిమి నీయఖిలము శుభకరం బయి వర్తిల్లెఁ జువ్వె యనఘ! అనతి దూరానఁ గలదు మాయాశ్రమంబు విశ్రమించి యచ్చట మీరు వెడలవచ్చు.
వృద్ధ - మాకుఁ బ్రాణప్రవిధానము సేసి యిదివఱకే యాతిథ్యమిచ్చి యుంటివి. అందుచేత మేము వెళ్ళుదము. సెలవొసంగుము.
భీమ - అట్లైన సకుటుంబముగ మీరు వెళ్ళుఁడు పునర్దర్శన మగుఁగాక!
వృద్ధ - మంచిది! అది మా ప్రథమ సంకల్పమే.