పుట:Bharatiyanagarik018597mbp.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పవటరన్ దేవాలయము

యవద్వీపమధ్యభాగమున సింగసరి మున్నగురాజ్యములు ప్రబలినపుడు బౌద్దమత ముచ్ఛదశనందినది. పిమ్మట దూర్పుజావాలో బిల్వితిక్తపుర సామ్రాజ్యము నిర్మింపబడిన తోడనే శైవమతప్రాబల్య మారంభమయ్యెను. మొత్తము మీద నీద్వీపమునందలి నిర్మాణకళలో నీరెండు మతముల ప్రభావమును గాంచనగుచున్నది. బిల్వతిక్త రాజులు నిర్మించిన కట్టడములలో బ్లిటర్ నగరమునకు సమీపమునందున్న పనటరన్ దేవాలయ మగ్రగణ్యము. ఇట నొక ప్రధానాలయమును, గొన్ని చిన్న దేవళములును గలవు. ఇదియొక శివాలయము. ఇందలి గోడల క్రిందభాగమున రామాయణ మహాభారతములలోని భాగములు చెక్కబడియున్నవి. ఈ శివాలయములో నీ వైష్ణవశిల్పము లుండుటనుబట్టి యీ దేశమునందుండెడి మతసహిష్ణుత వ్యక్తమగుచున్నవి.

చండి మెండట్ (Chandi-Mendut)

ఈ బౌద్దాలయము బొరొబుదుర్‌కు మైలున్నర దూరములో నున్నది. ఇందు మూడంతరువులున్నవి. అడుగు దానిలో నిరువది నాలుగును, రెండవదానిలో పదునారును, మూడవదానిలో నెనిమిదిని చిన్న స్థూపములును, మూడవ యంతరువు మధ్యగా నొక పెద్ద స్థూపము నిట గలవు. ఇందలి గోడలపైనను, ద్వారములపైనను హిందూదేవతలవిగ్రహములున్నవి. ఆలయమునందలి ప్రధాన విగ్రహము బుద్దునిది. మరిరెండు బోధిసత్వుల విగ్రహములుగూడ నిటగలవు. ఈమూడు విగ్రహములును బౌద్దశిల్పమునం దగ్రగణ్యములనియు, నియ్యవి హిందూదేశములోనిగుప్త శిల్పముల కెనయగుచున్నవనియు ఫెర్గుసన్ పండితుని యభిప్రాయము. ఈ యాలయములోని శిల్పకళ బొరొబుదుర్‌కంటె యభివృద్ధిని జూపుచున్నది.