పుట:Bharatiyanagarik018597mbp.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దాత్కాలిక భారతదేశ శిల్పములకును సన్నిహితమగు సంబంధముగలదు. ఇచటిదేయగు నొక దర్గానుండి యుద్దరింపబడిన శివుని శిరస్సు యీ కాలమున చోళరాజుల పాలనమునందుండిన దక్షిణ హిందూదేశమున నిర్మింపబడిన విగ్రహభాగమును పోలియున్నది.

డీ-యింగ్ పీటభూమి (Di-ing Plateau)

యవద్వీపమున డీ-ఇంగ్ అను నొక నిర్జనమగు పీటభూమిగలదు. ఇది సముద్రమట్టమునకు 6500 అడుగులయెత్తున నున్నది. ఇందుజీర్ణావస్థనున్న యాలయము లయిదుగలవు. వీనికి మహాభారత వీరులగు పాండవుల పేరిట చండిపుస్తదేవ (యుద్ధిష్టిర) చండీ భీమ, చండీ అర్జున చండీశ్రిఖండీ, చండీసేనుభద్ర యని నామములున్నవి. ఇయ్యవి నగరములకును గ్రామములకును సమీపమునగాక నిర్జన స్థలమునందుండుటచే యాత్రాస్థలములని దోచుచున్నది. జైను లిట్టిపద్దతి నవలంభించిరి. ఇయ్యవి బొరొబుదుర్‌వలె మనోహరములు గాకున్నను, హిందూదేవతల యారాధనకై, హిందూపద్దతుల ననుసరించి నిర్మింపబడి యుండుటచే మనకు ముఖ్యములు. ఇందలి శిల్పము నిరాడంబరము. ఇచ్చటి త్రిమూర్తుల విగ్రహములు రెఖశిల్పమునకు చక్కనిదృష్టాంతములు. ఈ యాలయములు క్రీ. శ. 9 వ శతాబ్దారంభమునాటివి. ఇయ్యవి దక్షిణ హిందూదేశములోని యాలయములను పోలియున్నవి. కొందరు పండితులు పట్టడకల్, బహోల్, బేలూరు, హళేబీడు మున్నగు స్థలములందలి చాళుక్య కట్టడముల నీ యవద్వీపాలయము లనుకరించుచున్నవని దలచుచున్నారు. మఱికొందరు దక్షిణహిందూదేశమునందలి పల్లవచోళ దేవాలయములకు నీ పీటభూమియందలి యాలయములకును సామ్యమున్నదని చెప్పుచున్నారు.