పుట:Bharatiyanagarik018597mbp.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారతీయ నాగరికతా విస్తరణము.

3. ఆఫ్‌గనిస్థానము.

ఆఫ్‌గనిస్థానము ప్రాచీనకాలమున బ్రఖ్యాతి బడిసిన పర్షియా మున్నగు పశ్చిమ ఆసియాదేశములకును, హిందూ దేశమునకును నడుమనున్నది. ఇందుండిన కొంత కాలమునకు బిమ్మటనే యొక యార్యశాఖ భారతదేశమునకు వచ్చినది. పిమ్మట నీ భూభాగము పర్షియను, గ్రీకు, హైందవశక, హూణ, తురుష్క, ఆఫ్‌గను, మొగలు జాతీయుల వశమై విచిత్రమగు పరిణామమును గాంచినది. కాన నీ దేశమున వివిదజాతుల యొక్కయు వారివారి నాగరికతల యొక్కయు సమ్మిశ్రణము జరిగినది. సామీప్యతనుబట్టి యీదేశమునకు బ్రాచీన కాలమునుండియు భారతదేశముతో సంబంధమేర్పడినది. హిందూ దేశమునుండి బశ్చిమ ఆసియా దేశములకు బ్రకృతి దత్తములగు రెండుమార్గములేర్పడినవి. అందొకటి సింధునదియును కాబుల్‌నదియును గలయుస్థలమునుండి బయల్వెడలి, కాబూల్‌నదిననుసరించి, హిందూకుష్‌పర్వతములను దాటి, బ్యాక్ట్రియను మైదానము గుండా పర్షియాకు పోవుచుండెను. రెండవమార్గము సింధునది యొక్క క్రిందభాగమున బయలుదేరి సులేమాన్ పర్వతముల ప్రక్కగా కాందహర్ నగరముమీదుగా హీరట్ నగరమున కేగి, యటనుండి ఎల్‌బర్‌జ్ పర్వతములకు దక్షిణముగా పశ్చిమదేశముల కేగుచుండెడిది. వీనిలో మొదటి మార్గము మిగుల ముఖ్యమైనది. డరయన, అలెగ్జాండరు, సెల్యూకస్, కాడ్‌ఫైసిస్ మున్నగు హిందూదేశ విజేతలును, హ్యూన్‌ష్వాంగ్ మున్నగు