Jump to content

పుట:Bhagira Loya.djvu/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నరసన్న పాపాయి

నరసన్న ఏడుపు, జనకోలాహలం, డప్పులు, బూరాలు, 'శివశివశివోహం' అనే భక్తుల కేకలు నా నిశ్శబ్దబాష్పాలు, మా అన్నయ్య నన్ను తిట్టడం, మా అమ్మ నన్ను కేకలు వెయ్యడం; నరసన్న ఏడుపు; ఏడుపు ! మా అన్నయ్య వాణ్ణి గుళ్లోకి వస్తున్నాడని చావకొట్టాడు.

నరసన్న పెద్దవాడయ్యాడు, నేనూ పెద్దదాన్నయ్యాను. నాకూ పెళ్ళయింది, నరసన్నకూ పెళ్ళయింది.

రుద్రేశ్వరం గుడి యెదుట మా అన్నయ్య శివరాత్రి ఉత్సవంలో వాడు గుడిలోకి రాబోయాడని అతన్ని చావ గొట్టాడు. అది నా పెళ్ళి లోనూ నాకు జ్ఞాపకమే ; వాడికి పెళ్ళి అవుతోందంటేనూ నాకు జ్ఞాపకమే!

నరసన్న మా అత్తవారికి పెద్దపాలేరయ్యాడు. ఆ వూరికి పెద్దమాల అయ్యాడు. కాని గుడి యెదుట వాణ్ణి మా అన్నయ్య కొట్టితే వాడు ఏడ్చిన ఏడుపే నాకు స్నేహితురాలయింది. అదే నాకూ నరసన్నకూ మధ్య ఏదో విచిత్రమైన పవిత్రమైన సంబంధం ఏర్పాటుచేసింది.

మా అన్నయ్య అతన్ని కొట్టిన సంగతి నేను మరచిపోలేదు. మా అన్నయ్యే మరచిపోయాడు. ఆ కొట్టడం చూస్తూ వున్న మా అమ్మా వాళ్ళూ మరచిపోయారు. ఆఖరుకు నరసన్నే మరిచిపోయాడు.

'ఏమయ్యా నరసన్నా! నీ భార్య కడుపుతో వుందట!'

43