'బాపిరాజు'
“అక్కడ ఒక శిల్పి ఆంధ్రబ్రాహ్మణ యువకుడు వుండేవాడు. అతడు సాంఖ్యాయన సగోత్రుడు. ఇక్ష్వాకు మహాప్రభువుల ఆస్థాన శిల్పి.”
“బౌద్ధ దీక్ష వహించినవాడా?”
“బుద్ధదేవుని విష్ణుని తొమ్మిదవ అవతారమని నమ్మిన వాడు. శిల్ప కర్మ రీత్యా మోక్షం చూరగొనా లన్న సంకల్పం కలవాడు. సౌందర్య తత్త్వోపాసి.”
“బుద్ధుడే పరమావతారం. ఆతని పూర్వ అవతారాలలో ఒకటి విష్ణు అవతారం.”
“ఆ శిల్పికి వసంతపుష్పాల సౌరభము, నీలాకాశము, మేఘాల నీలి అంచులు, చిరుగాలిలో పుట్టిన చిన్న కెరటాల మీద ప్రసరించి తళుకుమనే చంద్రకిరణాలు, సెలయేటి పతనాల తుంపురులు, ఇంద్రధనస్సు అంచులు, లేడి కూనల ముట్టెలు, సుందరీమణుల అపాంగ వీక్షణాలు పులకరాలు కలుగజేసి అతన్ని శ్వేతతారాదేవి పాదాల కడ మోకరిల్ల జేసేవి.”
“ఇంత నశ్వరమైన సౌందర్యాన్నా అతను ఆరాధించినది?”
“ప్రభూ? సంఘారామంలో, రాజ ప్రసాదాలలో అతడూ, అతని శిష్యులూ సృష్టించిన శిల్పాలూ, చిత్ర లేఖనాలూ, ఆ యా నగరాలలో ఆతడు నిర్మించిన భవనాలూ, స్థూపాలూ లోకమోహనమై వెలిగాయి.”
12