పుట:Bhagira Loya.djvu/112

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
జగ్గన్నగంటం
 


5

తన సైన్యానికి తానే ముఖ్య సైన్యాధికారై నడుపుకుంటూ వెళ్ళిన నాగమనీడు ప్రభువుకి ముఖ్య దళవాయిగా జగ్గన్నమంత్రి ధనుస్సులు, యీటెలు, అమ్ములు, శూలాలు మొదలయిన ఆయుధాలతో ఒక మత్తగజాన్ని ఎక్కి నాగమనీడు ప్రభుని కుడివైపున నడుస్తూ సైన్యాన్ని సర్వవిధాలా కనిపెట్టుచూ తాను యిదే ప్రధమపర్యాయం చూసే దేశాన్ని గమనిస్తూ సైన్యాల్ని సింహపురం దగ్గర పెన్న దాటించి భగవంతు నర్చించి తిరుపతి చేరుకొన్నారు. తిరుపతిలో నాగమనీడు ప్రభువు వెంకటేశ్వరస్వామివారి దర్శనం చేసి పూజలుచేయించి ముడుపులుచెల్లించి స్వామికడ శలవు దీసుకొని కతిపయ దినాల్లో తంజావూరు చేరుకొన్నారు.

జగ్గన్న హృదయం పరిపరివిధాల పోతున్నది. మనుష్యుల రక్తాలు ప్రవాహాలు కట్టడం, దేశాలు నాశనం అవడం, మనుష్యులు నిర్మించుకొనే ఊహాపధాలు నాశనం గావడం - మనుష్యులలో దైవత్వమూ రాక్షసత్వమూఉంది కాబోలు. రాజ్యాలు వస్తున్నవి రాజ్యాలు పోతున్నవి. మహారాజులు సింహాసనాలు ఎక్కారు. దేదీప్యమానంగా వెలిగారు. తెరవెనక మాయమయ్యారు. మతకర్తలు సకల శాస్త్రవేత్తలు, వేదాంతులు, మహాకవులు, సంగీత కళానిధులు అందరూ వచ్చి తమ తమ విధులను నిర్వర్తిస్తూ అలా అలా నడిచి కాలంలో కలిసిపోయారు.

111