పుట:Bhaarata arthashaastramu (1958).pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గ్రమ్మ నిశ్చేష్టితులై క్రిందబడుదురు! ప్రతి మానుష భావము నీరీతి వివిధ ప్రకాశములతో వెలుగును. వీనినే నిమ్నోన్నత దశలందురు.

కోపతాపములెట్లో యింద్రియ జ్ఞానమునట్లే. ఇంద్రియములనగా త్వక్చక్షురాది విజ్ఞానేంద్రియములు. శాస్త్రజ్ఞు లింద్రియముల యొక్క గ్రహణశక్తిని జక్కగా బరిశీలించియున్నారు. ఈ పరిశోధనలో నొక ధర్మ మన్నిటికిని సామాన్యమని స్ఫుటమైనది. అది యేదనగా:-

ఒక్క దీపము వెట్టిన నొకింత వెలుతురు దోచును. ఈవెలుతురును ద్విగుణముగ జేయవలయునన్న రెండు దీపములు చాలవు. రెంటికన్న నెక్కువ గావలసివచ్చును. అదెందులకని యడుగుట యసంగత ప్రశ్న. ప్రతి మనుష్యుని యనుభవమున నివి యిట్లుండును గాన నివెల్ల స్వాభావిక లక్షణములు. సత్తులు మనచే నిర్మింపబడినవి కావు. మనమొప్పకున్న విడిచి వెళ్ళునవిగావు. కావున నీచింత విడిచి మఱికొన్ని యుదాహరణముల జూపెదను. కన్నులెట్లో చెవులునట్లే. తంతిని మీటుడు. శబ్దము స్ఫురించును. తంతిని రెండింతలు బలముగా మీటుడు. ధ్వనియొక్క స్ఫురణ హెచ్చునుగాని రెండింతలు హెచ్చదు. జిహ్వయునట్లే. ఒక్క మిరెపకాయ వేసిన నెంతకారము దోచునో యంతకు రెండింతలు కారము గావలయునన్న రెండింతలు కన్న నెక్కువ మిరెపకాయలు పట్టును. అనగా సుమారు మూడు నాల్గు కాయలు, త్వక్కునునట్లే. ఒకపుల్లతో గొంచెముగ నొకని చేయి నదిమితిమేని వానికి చివచివగానుండును. రెండింతలు బలముగా నదిమిన చివచివ రెండింతలు చొరవ దాల్చదు. బహుశ: ఒకటిన్నర యింతలే. శీతము, ఉష్ణము, రంగులపసందు మొదలైన యింద్రియ గోచరములన్నియు నిట్లే. వేడిమి, మిరపకాయ, దీపము ఇత్యాదులు ప్రేరేపకములు. అవి కారణములుగ మనసునపుట్టు స్ఫురణభావము.