పుట:Bhaarata arthashaastramu (1958).pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేడిమి యానీళ్ళంజెందును. మొదటిదానిలో నుష్ణముయొక్కరాశి యెక్కువ. ఎట్లన పదిపిడకల యగ్నియందు లయమైయుండుగాన. తీక్ష్ణత తక్కువ, ఎట్లు? వెచ్చనీరుగావున. రెండవదానిలో రెండు పిడకల యగ్గియేకాన నుష్ణరాశి కొంచియము. రాశి కొంచెమైనను దైక్ష్ణ్యమధికము. ఎట్లన పతివ్రతవలె నంటరానిదగుట.

ఆ రీతినే మమతయొక్క యుద్రేకము లాఘవముచెందినను దానిమొత్తము గురుపరంబగుచు వచ్చుననుట నిర్థారితము.

ప్రాప్తికి ననురాగమునకునుగల మైత్రిని వెల్లడిసేయ ననుభవ గోచరములైన (ఇవి నాస్వానుభవ గోచరములు గావు) దృష్టాంతముల రెండు నుడివెదను.

బుద్ధిదెలిసినపిమ్మట వివాహమాడు నాచారముగల రాజ్యములలోను, శృంగారకావ్యములలోను నాయకా నాయకు లన్యోన్య సమాగమంబుగోరి "మన:ప్రభ వానల బాధ్యమానులై" యుందురుగదా! ఇది తొల్తటి వేడిమి. ఏవిఘ్నములునులేక పెండిలియయ్యె ననుకొనుడు. సేసబ్రాలుపడుసరికే 'ఇంకేమి చేతజిక్కెగదా' యను నిర్భయముచే గొందఱికి పొంగుఆర నారంభించుటయు గల దట! ఏది యెట్లున్నను దొలినెలలోనుండునంత తహతహ పిమ్మట సాధారణముగ బ్రతిమాలుకొన్నను హృదయగమ్యముగాదు. ప్రారంభమున 'తలచుకొన్న దాళలేనురా' యని రేయింబవలు జావళ్లు జపించువారు సైతము ఆరునెలలు నిండులోన చల్లబడి యుపేక్ష సేయుదురు. నాలుగైదు సంవత్సరము లైనయెడల 'త్యజసంసార మసార' మ్మని వైరాగ్యపు స్తోత్రపాఠముల కారంభింతురు.

మోహముయొక్క తాప ముపశమించినను మోహము నిర్మూలమాయెనని లోకజ్ఞులెవరు దలంపరు. ప్రాయశ: మన ప్రబంధ కవులట్లెంతురేమో! వారికి నిఘంటువులలోగల పరిచయము లోకమున లేదుగావున వారిమాట మనకేల? ఆదిని నిర్భరత దీప్తిమంతమైన