పుట:Bhaarata arthashaastramu (1958).pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విధేయమైనదని భావము. ఇప్పగిదిని రాశిమానము హెచ్చుకొలది మమతయొక్క యుద్రేకంబును, దృప్తిపరిమాణంబును తగ్గుచు వచ్చెడిని. మమత పరిమాణము మాత్రము వృద్ధియగు చుండు. మమత యొక్క యుద్రేకంబును, తన్మూలంబుననగు తృప్తియు, మమత పరిమాణంబును పరస్పరాలంబనంబులు గావునను మమత పరిమాణము హీనవృద్ధికి విధేయంబగుటచేతను ఈవృద్ధి అనంతంబుగాదు. ఉద్రేకము పూర్తిగతగ్గి తృప్తికి ఆకరము స్వల్పమగునప్పటికి అనగా నీపటమునందు అయిదవ రాశిమానము చేరునప్పటికి మమత పరిమాణము స్థాయియగును. ఏలయన రాశి ఇంకను ఎక్కుడయ్యెనేని ఉద్రేకము లేమింజేసి బాధ ప్రారంభమై రానురాను అసహ్యంబగు. కావున మానవుడు తనకలవాటుపడిన రాశిమానముల నయిదింటిని కాపాడుకొని తన్మూలముననగు సుఖంబునే అనుభవింపందలంచుగాని రాశి నెక్కుడుచేసికొని కష్టము దెచ్చిపెట్టుకొనం జూడుడు. మమత పరిమాణము స్థాయిగ నుండుననుటకు గృహస్థాశ్రమంబ దృష్టాంతంబు. దాని ప్రశంస ముందుగలదు.

పైజెప్పిన విషయములబట్టి ప్రతివస్తువును అమితముగ సేకరింపబడిన బాధావహంబగుననుట సువ్యక్తము. ఇట్లగుట మన కెంతయుమేలు, ఎట్లన, వివిధ వస్తుపరాయణచిత్తులమై విచిత్రభంగుల సంచరించుటకీ న్యాయ మాధారభూతము. లేకున్న నేకార్థసంధాయకులమై జన్మమెల్ల గడుపువారమై యుందుము. ఏకార్థభావమునకన్న ననర్థము అభావ్యము.

ఉద్రేకముయొక్క యుడుకు తగ్గినను నద్దాని మొత్తపు పరిమాణము తగ్గినదని భావింపరాదు. ఇది గూఢార్థముగాన తేటవడ జేయుటకై యొకనిదర్శనము సూపెద. పెద్దబానలో నీళ్ళుపోసి పది పిడకల నిప్పువేసినను నీరు వెచ్చగామాత్ర ముండును. చిన్నచెంబులో నీరుపోసి రెండుపిడకల గాల్చితిమేనియు వ్రేలువెట్టిన చుఱుక్కనునంత