పుట:Bhaarata arthashaastramu (1958).pdf/453

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1. శ్రమకరులకు యజమానత్వమిచ్చుట "కనకపు సింహాసనమున శునకము గూర్చుండబెట్టి పట్టము గట్టినట్టు" లగును. గొప్పబుద్ధియు దీర్ఘాలోచనయు లేనివారు గావున తగిన కార్యచోదకుని నియమింప జాలరు. మంచివానిని సమ్మతించి ప్రతిష్ఠించిరిబో! తఱుచు వానిపై గన్నుంచి "ఇట్లుచేయవలయు నట్లు చేయవలయు" నని తామే యాదేశింపదొడంగి కార్యంబుం దిన్నగజఱుగనీరు. మఱియు చోదకుడు తమయందలి తప్పులంజూపి శిక్షించెనేని "మనచే నియమితుడైనవాడే మనల దండించువాడాయెనే! రాగల వత్సరమున వేఱొకనికి ప్రభుత్వ మిత్త" మని దురహంకారముం గొనుటయు నరుదుగాదు. దండనీతి ప్రవర్తింపదేని యరాజకం సాక్షాత్కరించును.

2. ఈకాలమున బుద్ధిబలము మిక్కిలి ముఖ్యమైన వ్యవహార సాధనమనియు నమూల్యమనియు మున్నే తెలిపితిమిగాదె! లక్షలకొలది సంబళములొసగి కళాకోవిదుల దమ తమ పక్షమువారిగా జేయ సమాజముల వారు స్పర్ధింతురు. అన్యోన్యతా సంఘములలో శ్రమకరుల కింకను జ్ఞానశక్తియొక్క విలువ తెలియనట్లున్నది. చోదక పదవికి నెత్తబడినవానికి జీతము లెక్కువగనిచ్చుట యింకను వారలలో నాచారమునకురాలేదు. సంబళము సరిగ పనియు జబ్బే. అత్యంత సమర్థులు వేఱెడలకుబోదురు. మొత్తముమీద కోఆపరేషన్ సమాజములలోని కార్యవిచారణకర్తలు ప్రధమగణ్యులుగారు. మిక్కిలి నిపుణుల నాకర్షింప జాలినంత వేతనములనిచ్చుబుద్ధి వానికున్నంగాని యవి ముందునకురావు. "మనము చెమటగారునట్లు దినమంతయు గష్టించుచున్నాము. మన యజమాను డేమిచేయును? ఒకమూలలో పిళ్ళారిమాదిరి గూర్చొని కాగితములద్రిప్పుచు చుట్టగాల్చుచుండుటయేకదా యతనిపని? ఇందులకా యతనికి నెక్కువ జీతమిచ్చుట? యని శ్రమకరులు వాపోవుదురు కాబోలు? పాపము విద్యాగంధము లేనివారు! మనశ్శ్రమయొక్క స్వభావము జ్ఞానాంధులకెట్లు గోచరించును?