పుట:Bhaarata arthashaastramu (1958).pdf/452

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వ్యవహార సమాజములయొక్క యఖండమైన వృద్ధియే యిందులకు దార్కాణము. నమ్మిక బేహారముల కన్న మోసపు వ్యాపారములు ఘనతగాంచునా? వానిలో నెవరైన దమసొత్తులను బ్రయోగింతురా? మొత్తముమీద సమాజములు విశ్వాసయోగ్యములయ్యును, భాగస్థులెక్కడనో యేమూలనో యుండు వారు గావున చోదకులు సర్వ స్వాతంత్ర్యమునువహించి యడుగువారు లేరుగదా యను ధైర్యముచే నిశ్శంకముగ సామాజకులను బ్రజలను వంచించి యర్థముల దోచుకొనుటయు లేకపోలేదు. అన్యోన్యతా పద్ధతియందిట్టి యకృత్యముల కవకాశము తక్కువ. ఏలన, భాగస్థులు కార్యవిచారణాది కార్యముల సమర్థులగుటంబట్టి.

4. అన్యోన్యతా పద్ధతియందు మఱియు నొకగుణముగలదు. కొంతకుగొంత పరిచయముగలవారుచేరి చేసినంగాని యీ పద్ధతి బాగునకురాదు. అట్లగుట నమితములైన మూలధనముల సేకరించుట దుర్లభము. సామాన్య సమాజములలో లోకస్థులెల్లరును భాగముల గొనవచ్చును. దాన బాధలేదు. కోఆపరేషన్ సమాజములలో నిది పొసగదు కావున వ్యవహారములు సాధారణ సంఘ సాధితముల యంత విస్తారముం జెందవు. చుట్టుప్రక్కల స్థలములవారుదక్క నితరులుచేరిన నన్యోన్యత నశించును. కావున నిట్టివ్యాపారములు మితవ్యాప్తికములు. మితములైననను నిఖరమైన వాడుకకాండ్ర సమూహము నవలంబించి యుండునవిగాన స్థిరతరములు.

5. శ్రమకరులును కొంతమట్టునకు యజమానులతో దుల్యులుగ గణింపబడుదురు. కానవారు శ్రద్ధతో బనులం గావింతురు. మేస్త్రీలు మొదలగు విచారణకర్తల నియమింప గారణములేనందున సెలవు మిగులును.

సిద్ధాంత మిట్టిదయ్యును ననుభవమున కోఆపరేషన్ సంఘముల యందును లోపము లనేకములు గన్పట్టెడిని:-