పుట:Bhaarata arthashaastramu (1958).pdf/450

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అన్యోన్యతా (కో ఆపరేషన్) పద్ధతులు

వర్తమానమున నార్థికవిచారములంబట్టిచూచిన దేశమ్ములోని జనులు మూడు తెగలుగ నున్నవారు. కారయితలు, కార్మికులు, వినియోజకులు, అనగా కొనువారు. ఇది గుణభేదముగాని మూర్తి భేదముగాదని ఎఱుంగునది. ఎట్లన, ప్రతిమనుజునందును నీవ్యాపారములన్నియు లీనమైయున్నవి. కారయితలును బాటుపడుదురు. వస్తువులగొని యనుభవింతురు. కార్మికులును దమపాటునకు దామేకర్తలు. వారును గూలిబడతుట భోగమునకేకాని పాతిబెట్టుటకుగాదు. వినియోజకులును పదార్ధములను సేకరింపగోరిన మాఱుపదార్థముల నిచ్చియో శ్రమించియో గడించుట యగత్యము అట్లగుట వారును ఉత్పాదకులే. కావున నేమియుదినక కష్టపడువారుగాని, కష్టపడక తినువారు గాని, యున్నారని భ్రమజెందబోకుడు!

ఇమ్మూడుజాతులకునుండు పరస్పరమైత్రి యెట్టిదనిన

1. కారయితలు, కార్మికులు నుత్పాదకులు. ఉత్పత్తికి వినియోగమాధారము. వినియోగమునకు నుత్పత్తి యాధారము.

2. కారయితలు కార్మికులును గలిసినంగాని యుత్పత్తి గొన సాగనేరదు.

ఇక వీరికుండు శత్రుత్వము

1. ఉత్పాదకులు వెలలుహెచ్చిన మేలందురు. వినియోజకులు తగ్గిన మేలందురు.

2. ఉత్పాదింపబడిన ఫలము బంచుకొనునెడ యజమానులకును గర్మకరులకును ద్వేషముపుట్టుట సహజము. కర్మకరులు సంబళ మెక్కువగా గావలయునందురు. నాయకులు తగ్గింపజూతురు.

కావున నాయక సేవకులకును, ఉత్పాదక వినియోజకులకును, గొన్నివిషయములలో పరస్పర భేదములున్న వనుట స్పష్టము. ఇదియు నొకవిధమైన మాత్సర్యమ. దీనిని నిరోధించు పద్ధతులు కొన్నిగలవు.