పుట:Bhaarata arthashaastramu (1958).pdf/449

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2. ఇట్లే యన్నివ్యాపారములును జేయబడెనేని యజమానులకు, శిల్పులకు, ప్రజలకును, లాభములు, వేతనములు, వెలలును, నిలుకడగాంచినవవును. హెచ్చుతగ్గులవలని బాధ లికముందుపుట్టవు.

3. స్పర్ధయే శరణమనియుండు నీకాలమునందును సంధి సంఘముల గొంతవఱకును రాజ్యాంగమువారే పరిపాలింప జూచుచున్నారు. ఇకముందు నన్ని యార్థికతంత్రములును రాజ్యాంగ కృత్యములై సమష్టినాయకత్వంబు పట్టభద్రం బౌననుటకు నిది మార్గమును శుభశకునమునై యున్నదనుటకు శంకయేల?

ఇంగ్లాండులో సంధిసంఘములు ప్రబలకుండుట

ఇంగ్లాండులో సంధిసంఘములింకను అమెరికా, జర్మనీ దేశములలోబలె నావిర్భవింపలేదు. ఇందులకు ముఖ్యమైన హేతువులు మూడు:-

1. దిగుమతులమీద స్వదేశవ్యాపార రక్షణార్థము శుల్కములు విధింపబడమి. ఇందుచే బరదేశ వస్తువులు ధారాళముగ దెప్పింపబడును.

2. ఇంగ్లాండులో నయ్యైవ్యాపారముల సంఘముల యజమానులు సంధియను నియమమున బద్ధులు గాకయున్నను వేళవచ్చినపుడు తమకు సామాన్యములైన విషయములంగూర్చి కలసిమాట్లాడు కొని యంగీకారభావముతో బనిజేతురు. ఇంతకన్న నెక్కువగ బద్ధులైయుండుటకు వారికిష్టములేదు. దీనికై ఏర్పడినయవి కారయితృ సంఘములునాబడు.

3. సత్సంప్రదాయము, సౌశీల్యము, గొప్పబుద్ధియుగలిగి వ్యాపారము జేయుటయందుబలె నపారార్జన మందు వీరికంతగా నాసక్తి యుండునట్లుగానము. లోభంబుమాత్రము మహావ్రతమని యిప్పటి వఱకును బూనరైరి. ఇకముందెట్లో!