పుట:Bhaarata arthashaastramu (1958).pdf/433

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రమకరులు. జనసంఖ్యలో ముక్కాలు మువ్వీసమునకన్న నెక్కువగ నెల్లదేశంబుల వీరున్నారు. వీరికి సమర్థతయున్న నగస్త్యునిబోలె నుత్పత్తి సాగర మెంతపొంగినను నొక్కగ్రుక్కగా బీల్చివైతురు. కావున వీరియొక్క పేదతనమే తమితోత్పత్తికి నిజమైన కారణము. మఱి యీ దారిద్ర్యమునకు బుట్టుభూమి యెయ్యది? ఆధునికార్థిక స్థితులు. ఎట్లన, ప్రతి యజమానుడును దనతన యాస్తియని కూడబెట్టుట, ఇచ్చవచ్చిన వ్యాపారముల కుంబూనుట, సొత్తుగలవారగుటచే బేరసారమ్ముల బలవంతులై యుండుట, బీదలు కుక్షి బాధ కోర్వజాలక యల్పవేతనముల నాశ్రయింపవలయువారగుట. ఇందుచేత గూలి తక్కువ యగుటయు యజమానులకు లాభమెక్కువయగుటయు విశదము. కావున ప్రజలు కోరిక లెన్నియో కలవారయ్యు వానిం దీర్చికొన పోడిమిలేనివారై యున్నారు. తాము కష్టపడి కల్పించిన ప్రయోజనములన్నియు దమ్మే చెందినయెడల దామును నాఢ్యులై యుందు రనుట కేమిసందియము? అయినను నీమాత్సర్యకాలములో "చెట్టుపెట్టి పెంచినవాడొకడు. దానిఫలము ననుభవించువాడొకడు" ననురీతిని బాటుపడి ప్రయోజనములం బుట్టించువారు కర్మకరులు, దానిని దన్నికొనిపోవువారు యజమానులు. కాకులనుగొట్టి గ్రద్దలకు వేసిన విధంబున నీస్పర్ధయనునది బీదల నదుమును. మహారాజులం బొదలజేయును. అట్లుగాక యార్జనముకొలది నర్థంబు లలవడునేని శిల్పులాఢ్యులౌదురు. మూలధనముయొక్క వృద్ధి నాశించి గణనకు వచ్చువా రల్పులౌదురు. కావున వర్తమానస్థితిని లయింపజేసి యన్ని వ్యాపారములు సంఘపరిపాలితములుగ జేయుట కర్తవ్యము. అట్లైన నీదుండగము లతో గండములు నడంగును.

మఱియు నొక్క విచారము. క్షోభ లనివార్యములా నివార్యములా? నివారించుటకుంజాలిన హేతువు లెయ్యవి? ఈ హేతువులు సంపూర్ణ సుఖదంబులా? లేక ముల్లుదీసి కొఱ్ఱడచునట్టివియా?