పుట:Bhaarata arthashaastramu (1958).pdf/415

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జాలిరేని వానికి ప్రాణము లల్లలనాడును. ఇదియు విస్తరతకు భంగకరము.

విస్తారశాలల ప్రభవిల్లు వృత్తులు

1. రచనాకళలు. స్పష్టము.

2. విక్రయస్థానములు. పెద్దయంగళ్ళలో బలుదినుసులును బ్రతిదినుసులోను నానా విధములైన రకములు నుండునుగాన నయ్యవి స్వయంవర రంగములు, రసికజన సమాదరణీయంబులు, గమ్యంబులు.

3. సంచయములుగా వస్తువులంగొని యమ్మకమునకు నుంతురు గాన దీయుసెలవు తక్కువపడును.

4. మొత్తముగ సరకులదెచ్చుటయు గొనుటయు గలదు కాన యానవేతనములు నచ్చివచ్చును.

5. ఉత్పాదన శాలలయందుబలె పణ్యశాలలయందును విస్తార వ్యాపారులు లఘు కార్యంబులకెల్ల సేవకుల నియోగించి తాము గురుకృత్యంబులైన మంత్రాలోచనాదులం జేయ నవకాశముం గల్పించు కొందురు. చిల్లర షాపులలో నిన్నిపనుల జేయవలసినవాడు యజమానుడొక్కడే.

చిన్నయంగళ్ళ వారియం దభిగతములైన భవ్యంబు లెవ్వి యనిన:-

1. స్వయంవిచారణ. స్పష్టము.

2. వినియోజకుల కనతిదూరమ్ముననుండుట. పెద్దయంగళ్ళను వీధివీధికిని బెట్టుటకుగాదు. చిన్నయంగళ్ళు వెదజల్లినట్లుండవచ్చును.

3. వాడుకకాండ్రతోడి పరిచయము. వారిమనసు పొందెఱింగి నడచియు వస్తువుల సమకూర్చియు దమతో నియత క్రయకులం జేయుట.