పుట:Bhaarata arthashaastramu (1958).pdf/28

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

సాధ్యముకానోవు. నాగరికముహెచ్చి ఆశలు అనంతములయి ఉత్పత్తులు లెక్కకు మీరిన వెంటనే ఉత్పత్తులను మార్చుకొనుటకు వీలుపడక నాణెరూపమగు ద్రవ్య మను మధ్యవర్తి యవసరమగు చున్నది. ఈ నాణెములను నిర్మించువారు నిర్ణయించువారును ఎల్లెడలను ప్రభుత్వము వారగు చున్నారు. ప్రభుత్వములెల్లయు దైనికములు కావుగదా. కావున నాణెములవలన అర్థశాస్త్రమున ననేకాభ్యానములు వెలువడియున్నవి.

నాణెములువచ్చి వినిమయము అనగా సామగ్రుల మార్చుకొనుట హెచ్చిన కొలదిని లోకమంతయు ఒక్కటే ఇల్లగుపగిది వ్యాపారము విజృంభించినది. ఈ వ్యాపారమువలన నానాదేశములకు నుండవలసిన పరస్పర సంబంధములు తేలవలసి వచ్చినది. లోకవ్యాపారమున మనదేశము నిలుచునా క్రుంగునా యను భయము ప్రతిదేశమునకును పొడకట్టమొదలిడి దానివలన నిర్బంధవ్యాపారము అనిర్బంధ వ్యాపారము మొదలగు అభ్యాసములును వ్యాపార చట్టములును చిహ్నములును బయలుదేరినవి. ఇచి ఎల్లయు అర్థశాస్త్రాంతర్గతములే.

ఉపాఖ్యానములు

చెట్లునఱకు కూలివాడుమొదలు రాజ్యతంత్రమును నడపు మంత్రిపుంగవునివఱకు అందఱు చేయుపనికిని శ్రమయనియే పేరు. కాని ప్రజ్ఞావంతులగు కొందఱు అంత యెక్కువగ జ్ఞానసంపాదనముచేయని పెక్కురను లోబఱచుకొని మొదట మొదట సాహసముల జేతురు. పెక్కురును జ్ఞానవంతులయినతోడనే ఈపెక్కురకును అకొందఱకును ఘర్షణ తప్పదు. ఇదియే పాశ్చాత్యదేశముల సంభవించి యున్నది. ప్రకృతిని లో బఱుచుకొని మూలధనమును చేర్చుకొనిన ప్రజ్ఞావంతులగు కర్తలు కర్మకరులచేత (అనగా సాధారణపు కూలివారిచేత) పనుల చేయించుకొని కోటీశ్వరులయియున్నారు. కర్మకరులును రానురాను ఎక్కుడు జ్ఞానవంతులగుచు వచ్చుచుండుటచేత కర్తలతో తమ్మునుపోల్చుకొని వాఠిని ప్రతిఘటించుచున్నారు. ఇట్లు కర్తలకును కర్మకరులకును పొడమిన పోట్లాటల వలన కూలిసంఘములు, వీనిమీద నాదారపడియుండు 'సిండికలిజము' అను నూతన తత్త్వము, సంభూయ సముత్థానసభలు, సమిష్టివాదములు వెలువడినవి.

విజ్ఞాపనము

ఈసంపుటమునను ముందుసంపుటములయందును మాగ్రంథకర్తగారు ఈవిషయముల నన్నిటిని మానసికాది శాస్త్రములతో సమన్వయముచేసి భారతఅర్థశాస్త్రముగ రచించుచున్నారు. అభిప్రాయముల నెన్నయేని భేదములుండుట ఈ శాస్త్రమున వింతగాదు. కావున అట్టి భేదములను పాటింపక వాచక ప్రపంచ మీ గ్రంథమును వరించి శ్రేయస్సునందుదురుగాత :

సహాయ సంపాదకుడు,
కె. వి. లక్ష్మణరావు ఎం. ఏ.