పుట:Bhaarata arthashaastramu (1958).pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పదునైదవ ప్రకరణము

యంత్రకళలు

వెనుకటి ప్రకరణమున యానోపకరణముల చర్చచేయబడినది. దాని నంతటితో జాలించి వినియోగ్యవస్తు సృష్టియొనరించు యంత్రముల గూర్చి కొంతయోచింతము.

2. యంత్రకళలు, అనగా యంత్రములచే నూలువడకుట, బట్టలునేయుట ఇత్యాదిక్రియలు.

చెన్నపురిలో పదునైదు సంవత్సరములక్రిందట రాకపోకలకు బడుగు గుఱ్ఱములంబూన్చిన మూడుమొగముల జట్కాబండ్లుండునవి. ఇంకను వానికి ప్రళయము రాకపోయినను ప్రకృతము ట్రాంబండ్లు వేయబడినందున వానిప్రాబల్యముతగ్గినది. దీనిచేత చెన్నపురికి లాభమా నష్టమా యనుట చింత్యము. నష్టములు - 1. గుఱ్ఱపుబండ్ల యజమానులు తోలువారు వీరికి జీవనము కష్టతరమైనందున ననేకులావృత్తి వదలవలసినవారైరి. 2. ఆగుఱ్ఱములకు బెట్టుటకుగాకున్నను చూపుటకైన దెప్పింపబడు కసవును పెంచువారు, మోయువారు, అమ్మువారు వీరికి బత్యము సున్నయయ్యె. ఇట్లు కొంద ఱిడుమల నొందిరనుట నిర్వివాదాంశము. ఇక లాభములు - 1. నికరమైన బాడుగ లుండబట్టి లడాయీలు లేకపోవుట, ప్రయాణములు సుఖముగాను మునుపటికన్న నయముగాను జరుగుటచేత జనుల దేహమునకును సంచికిని నష్టము లాఘవంబునొందుట. 2. ఇన్‌స్పెక్టరులు, ట్రాములనడుపు వారు, టిక్కట్లు ఇచ్చుటలో తమకుగొంచెము, కంపెనీకి గొంచెముగా జాగ్రత్తతో వేసికొనువారు, పైతంతులు క్రిందికమ్ములును సరిచేయువారు, ఇట్లు క్రొత్త క్రొత్త నౌకరులేర్పడి మొత్తముమీద జీవనోపాయములు విరివిజెందుట ఇత్యాదులు. మఱియు నీనౌకరులు