పుట:Bhaarata arthashaastramu (1958).pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పదునొకండవ ప్రకరణము

శ్రమవర్గు - పురుషకారము

శ్రమయనగా నేతదర్థముగాక భిన్నలాభప్రాప్తికై పడునట్టి ప్రయాస. చెండాడుట, జలకేళి, వనవిహారము ఈలాటివి అలసట బుట్టించునవి యైనను పరిస్రమార్థము చేయబడునవి గాన వ్యాయామము లనబడును. ఆటలలో ఆటయే కాంక్షితంబుకాని వేఱొండులేదు. నేయుటకై బట్టలు నేయువాం డ్రెవ్వరునులేరు. మఱి సాలెవాండ్రేల నేతపని జేతురన బట్టలనమ్మి వలయుసామగ్రుల గొనుటకు. అంత:పుర కాంతలు ఉద్యానవనవిహారమునకుం దొడంగిభంగి కృషీవలుడు నాగేటిని విహారార్థముగా భుజముమీదనెక్కించి పొలములకుబోవుట లేదు. కావున శ్రమ వ్యాయామములు భిన్నములనుట గ్రాహ్యంబు.

మహాత్ములైనవారు కృతకృత్యతకన్న మించిన మేలులేదని యెంచి తమ శక్త్యనుసారముగ బాటుపడుదురు. కాళిదాసునివంటి కవి జీతమునకై పద్యములు చెప్పునా? మన కాటలలో బాటవ ముండురీతి గొందఱికి శాస్త్రాధ్యయనమున నుండును. సాలెపురుగు తంతుసద్మముల నిర్మించునట్లును తేనెటీగలు మధువును గూడబెట్టు మాడ్కిని మహాకవులును విశేష శేముషీశోభితులైనవారును చిత్రకారులును సహజోద్యోగులై తమతేజంబు వెలిబుత్తురుగాని ప్రయోజనాంతరముల నంతగా ఆశించిచేయరు. కోయిల తనకు వశములేక కూయునట్లు కళాదక్షులు తమ నైపుణింజూపుట సహజము. అట్టివారికి ధనాదులు లభింపకపోయినను గీర్తి లభింపకపోదు. కావున ధనసిద్ధి ప్రసిద్ధులకై వారు తమ ప్రభావంబు బ్రకటించిరనుట న్యాయంబు గాదు. అమోఘంబులు నఖండ యశ:కరములగు సంకల్పము లట్టి మహామహులనుండి స్వచ్ఛందముగ నుద్భవించును. అయినను కేళుల