పుట:Bhaarata arthashaastramu (1958).pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వోలె తమవిధులం దీర్చుకొనువారు వెయ్యింటి కొకరును గలుగుట యరుదుగాన శ్రమ కార్యసాధనంబునకు దావలంబనుట నిజమే.

ఒకనికి క్రీడగా గనుపించునది మఱొక్కనికి క్లేశకరమైన క్రియగా దోపవచ్చును. రాజులకు వేట వినోదము. మాంసమునమ్మి బ్రతుకు సాగించుకొను బోయవాని కందులో నానంద మేమియు నుండదు. మఱి పొట్టకొఱకై పడవలసిన పాటుగాన నప్రియముగా నుండును.

పురుషకారము హీనముగా నెంచుట తగదు

ఉద్యోగయుక్తులమైనంగాని ఫలసిద్ధిచేకూఱదు. పక్వమైన పండ్లు సైతము తమంతటవచ్చి మననోటబడవు. దేవుడే గతియని యూరకున్న అభావమేగతి. ప్రయత్నంబులెల్ల సఫలంబులౌనా యని కొందఱాక్షేపింపవచ్చును. ప్రయత్నములేనిది సిద్ధికాదని యంటిమిగాని సర్వ ప్రయత్నములును సిద్ధినొందునని వచింపలేదు. కాన నీయాక్షేపణ యప్రయోజనము. ఈ విషయమైన వాదముల గొన్నిటి నింకను విమర్శించుట యర్హంబు.

భారతములో జెప్పబడిన

       గీ. "కార్యఫలములయెడ దాన కర్తననుట
           కడు నెఱుంగమి జువ్వె: దా గర్తయేని
           దవిలి తనదైన కార్యజాతంబు లెల్ల
           జెడక ఫలియించునట్లుగా జేయరాదె?"

అను పద్యము ప్రబలప్రమాణముగా నందఱిచేతను గ్రహింపబడియున్నది. ఈ తర్క మెట్లున్న దనగా "నేను సర్వశక్తుడనుగాను. కావున నాకు ఏశక్తియులేదు" అన్నట్లు. "నాకు ఎగురుటకు ఱెక్కలులేవు. కాబట్టి నడచుటకును కాళ్ళులేవు" అనిన నెంత పరిహాసపాత్రమో యోచింపుడు. "పౌరుషమొండే చాలును వేఱేమియు బనిలేదు" అని వాదించువార లెవరును లేరుగాన నీప్రత్యాఖ్యాన మెవరిపై నెత్తబడిన బ్రహ్మాస్త్రమో తెలియ