పుట:Bhaarata arthashaastramu (1958).pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రెండుసమయములు. ఎవ్వియన, "ఈ స్థితిగతు లీరీతినే నిర్వికారముగ జరుగుచున్న" వని యొకటి; "వికల్పం బాపాదించు కారణములు తుదముట్టుదాక బుట్టకయున్న" వనుట రెండు.

సర్వకార్య కారణములును బరస్పర సమ్మేళనముగలిగి మిశ్రమైయున్నను విషయము సుబోధమగుటకై వానిని వేఱుపఱచి చూపుట సర్వసమ్మతము. లోకములో నేసంకరమునులేక ప్రవర్తించు న్యాయములు కారణములు ఫలములునులేవు. అయినను నీచిక్కును విడదీసి పోగుపోగుగాబెట్టకున్న తుద మొదలేర్పడక పోవునుగాన నట్లు చేయుట కర్తవ్యము. పుస్తకములలో నివి విడదీయబడియుండుటచే సాక్షాత్తుగ ప్రపంచ ప్రచారములయందును విడబడియున్నవని యెంచబోకుడు; లోకమం దన్నిన్యాయములును పెద్దముడిగా జేరియున్నవి. ఆముడి యింతగట్టియని చెప్పనలవిగాదు. వ్యవహారముల నట్లున్నను విద్యావైశద్యార్థము చిక్కులేక ప్రక్కప్రక్కన నుండువానింబోలె వానిం గణింతుము.

ఇందుచే నొకగొప్ప జాగ్రత స్ఫురించెడు. ఏమన పుస్తకములో నున్నంత విశదముగ నంశములు లోకములో నుండవు గాన లౌకిక జ్ఞానమునకు బుస్తకపారాయణముకన్న ననుభవము ముఖ్యము. భారత అర్థశాస్త్రపండితు లందఱును వ్యాపారపారీణులౌదురనుట గేలిమాట. పారాయణమునకు ప్రవర్తమునకును జాల వ్యత్యాస మున్నదనుట వేదాంతులు బలసియుండుచోట్లలో విస్పష్టమేకదా ! కావుననే గ్రంధాదినే యియ్యడి యుపదేశ శాస్త్రంబుగాదని విన్నవించితి. అట్లైన నిది వ్యర్థశాస్త్రము గదాయని సంకోచింతురేమో, యదియును దగని యభిప్రాయము. ఇది మోడు తెఱంగుల నుపయోగకరము.

1. శాస్త్రము ఇతరచింతలు లాభములు నాసింపకయె సేవింపదగినది. జ్ఞానికి జ్ఞానమే బహుమానము. ఆచరణ కౌశల్యము లేకున్న వానికేమితక్కువ? తనతన యుద్దేశముల నెరవేర్చుటయే కృతకృత్యత.