పుట:Bhaarata arthashaastramu (1958).pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నవిగావు. మఱి కలసిమెలసి రూపుమాఱి తజ్జనితఫలంబున గుప్తంబులై యుండును. అనేక కారణములచే నొకకార్య మేర్పడియె ననుటకు నిజమైన యర్థమేమనగా, ప్రతికారణముయొక్కయు ఫలములు మిళితములైనవియనియు, ఈ మిశ్రఫలము ఏకఫలమట్లు తోచుననియు ననుట. కాలముచే నితరన్యాయంబులును, ఇతరన్యాయములచే కాలసంజనిత విభేదంబులును మాఱ్పులజెంది సమాగతంబులగును. ఇయ్యది యెట్లున్నదనగా గంగాయమునల సాంగత్యమట్లు. యమునవచ్చి పైబడకయున్న గంగ యింకను దక్షిణముగ బాఱియుండునేమో. గంగ యమున కడ్డముగాకున్న నది నేరు తూర్పుగ బోయి యుండును. వీనియొరయికచే రెంటికిని సామాన్యమగు నూతనమార్గ మొకటి యేర్పడినది. కావున రెండింటి ప్రతాపములు నేకీభవించి యింకొక జాడచెందినవనుట యొప్పు. ఇట్లే ఏడును రెండుతోగుణించిన బదునాల్గగును. ఈ పదునాల్గు ఏడుచేతవచ్చినదిగాదు. రెండుచేత వచ్చినదియుగాదు. వాని సంగతిచే వచ్చినది. నూతనసృష్టమైన పదునాల్గులో ఏడును రెండును బొత్తిగా నశింపక రూపభేదములందాల్చి ప్రవర్తించెడిని. ఆర్థిక న్యాయ సంయోగ తత్త్వం బివ్విధంబని యెఱుంగునది.

ఆర్థికన్యాయంబు లమోఘంబులని కొందఱనిరి. రామబాణము వలె దప్పక గురిదాకుననవి కావనుమాటనిజమే. ఎట్లన, వ్యతిరేక న్యాయములచే నిరుద్ధములు గావచ్చును. రాశితగ్గినను కొన్ని సమయముల వెలలును దగ్గవచ్చును. ఇట్లవక్రవిక్రమములు గాకపోయినను ఱిత్తవోవునవి యని భావించుట తప్పు. ఏలయన, తమకు నడ్డమువచ్చు వానికి దామును అడ్డముగానుండు గావున నీవిరోధము పరస్పర కార్యము. నూతనముగ నేర్పడు మార్గమున నిరుదిక్కుల న్యాయములయుం బ్రభావములు లీనమైయుండు. "ఈ న్యాయ మీరీతి వర్తించును. ఈ హేతువున కీఫలము సిద్ధము" అను వచనమందెల్ల