పుట:Bhaarata arthashaastramu (1958).pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బోవునట్లు చేయవలయునేకాని, కొందఱు శాస్త్రకారులు చెప్పినట్లు నిగ్రహమనుపేర ఛేదించుట తగవుగాదు. వేయి ప్రమాణములేల ? ఇంద్రియములను వాంఛలను శత్రువులని నమ్మిన మన మేస్థితిలో నున్నాము ? వానిని మిత్రములని నమ్మిన పశ్చిమఖండనివాసు లేస్థితిలో నున్నారు ? సరిపోల్చి చూడుడు !

వాంఛాస్వభావము

1. వాంఛలు అసంఖ్యములు. ఒకటి తృప్తి జెందుసరికి వేరొకటి యంకురించును నాగరికత యెక్కువయగుకొలది వాంఛల సంఖ్యయు నెక్కువయగును. హిందూదేశములో మునుపటికన్న నిప్పుడు వస్తువులయం దభిలాషలు హెచ్చుచున్నవి. ఇండ్లు, బండ్లు, వస్రములు, నీరు మొదలగునవి మునుపటికన్న మంచివిగా నుండ వలయునని మనము ప్రయత్నపడుచుండుట యెల్లరకు విదితమే. నిరాశులై యెందులకు బనికిరాకయుండిన మన కాంగ్లేయుల సత్సహవాసం బాశాధాన మొనరించి తన్మూలకముగ నాగరికత నొందుటకు ద్రోవసూపినది. అన్నిదానములకన్న నాశాదానమే ప్రధానము. గింజలు మొలిచి భూమికి రమణీయత దెచ్చునట్లు కోరికలీరికలెత్తి జనసమూహమునకంతయు నుత్సాహోద్యోగముల నొసంగి కనుల పండువుగా నొనరించును. మన జీవితము నొక నదితో బోల్ప వచ్చును. నది సదా జలము ప్రవహించుచుండినయెడల చూచుటకు గడు రమ్యముగాను, త్రాగుట కారోగ్యకరముగాను నుండును. పాఱుట నిలచినచో నీరు కంపెత్తి యసహ్యత బుట్టించును. అట్లే ఏదేశములో నానాటికి గ్రొత్త క్రొత్త యుద్దేశములు ప్రభవిల్లి వెల్లివిరిసి విజృంభించుచుండునో యాదేశము శ్రీమంతముగాను శక్తిమంతముగాను నుండును. 'ఈమాత్రము దొరికినది చాలును. పెద్దలుపోయినత్రోవ చాలదా ? క్రొత్తయేర్పాటు లెందులకు ? ఇక్కడనె యీరీతినె బ్రదికినన్నినాళ్లు సుఖముగ విశ్రాంతిగ నుండుదుము.'