పుట:Bhaarata arthashaastramu (1958).pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనువారు నానాటికి మిగుల హీనస్థితికివచ్చి దుర్బలులై బలవంతుల వాతబడుదురనుట దేశచరిత్రంబులు వేయినోళ్ళ ఘోషింపుచున్నను చెవిటిహిందువులకు వినరాకున్నది కాబోలు !

వాంఛ యుత్తమోత్తమ మనుటకు మఱియొక్క నిదర్శనము చూపవచ్చును. మనుష్యులలో నైకమత్యమున కిదియొక ముఖ్యకారణము. ఇల్లు గట్టవలయునన్న, ఆభరణములు చేయింప వలయునన్న ననేకుల సాహాయ్యములేనిది కొనసాగదు. నిస్పృహత్వము వహించిన వారు తమంతట బ్రత్యేకముగ నడవులలో నుండనౌనుగాని సంసారులమగు మనమట్లు ఇతరులసాయము నపేక్షింపకయుంట యసాధ్యంబు. కావున గాముకత్వంబు (అనగా ఆశలుకల్గియుండుట) సంఘీభావమునకు హేతుభూతంబు, సంఘీభావములేనిది దేశము దేశస్థులును నాశమొందుదురు గాన లోకోద్ధారణమునకు సస్పృహత్వం బాలవాలంబు. ఆశను బాశమందురు. జనుల నొకటిగాజేర్చి సామర్థ్యవంతులజేయు పాశమేగాని యమపాశము గాదుగాన దీనిని ద్రెంప నక్కఱలేదు.

2. ఆశలు అసంఖ్యములైనను ననంతములుగావు. అనగా ప్రతికోరికను తృప్తిజెందింపవచ్చును. తృప్తియైనచో నప్పటికాయాశ యంతమొందును. ఎంత యాకలి గొన్నవాడైనను గడుపార భుజించిన పిమ్మట నప్పటి కాకలి లేనివాడగును. భూషణప్రియులు దమకు గావలసిన నగలు లభించినతోడనె సొమ్ములను గుఱించి కలవరించుట మానుదురు ఇదియెంతయు ముఖ్యాంశము. ఇట్లు గాకున్న బ్రతివాడును ఏదైన నొకవస్తువునే యార్జింపుచు యావజ్జీవము గడుపవచ్చును. అట్లేల కాదన గావలసిన కొలది సేకరింప బడిన వెనుక నావస్తువునందు ప్రీతి మనకు దగ్గును. ఇంకను నధికముగ సేకరించుట కుపక్రమించితిమా యీన్యూనతహెచ్చి తుదకు అసహ్యత గలిగించును కావుననే మనమేవస్తువునైన నభిలాషకొలది నాదర ముంచి యార్జింతుము.