పుట:Bhaarata arthashaastramu (1958).pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రెండవ ప్రకరణము

వాంఛలు పురోభివృద్ధికిఁ గారణములు కాన ననుగ్రహింపఁదగినవి

                "సొమ్ము గోరిన యంతనె సుఖము గలుగ
                 దది యుపార్జింపగా సిద్దియగుట నిజమె ?" -భారతము

అర్థము తనంత ప్రత్యేకముగా మన కుపయోగమునకు వచ్చునట్టిది గాదు రూప్యములను వేచి తినువారెవ్వరును లేరు. ఇక ధనమువలని ప్రయోజన మేమన్న మనకు వలయు వస్తువులు కొనుట కనుకూలమైన సాధనముగనుంటయే. ధనముగాక తక్కిన వస్తువులుగూడ దమంత బ్రత్యేకముగ నుపయోగించునవికావు. ఏపదార్థమైన నుపయోగ పడవలెనన్న నందులకు కాంక్ష ముఖ్యమైన కారణము. చూడుడు ! గ్రుడ్డివానికి జిత్తరు వుపయోగించునా ? చెవిటికి సంగీత మానంద మిడునా ? కనులులేనిచో సౌందర్యమును, చెవులులేకున్న గానమును నెట్లప్రయోజకములో, యావిధముననే మనుజునకు వాంఛలేకయుండిన నేవస్తువును బనికిరావు. ఆకలిలేకున్న నన్నమెందులకు ? మానంబుచే గాదె వస్త్రములకు విలువగలిగె ? అలంకారాభిలాషయేకదా స్వర్ణాది వస్తువుల యుత్కృష్టతకు గారణభూతము ? నిష్కామియైనవానికి లోకమంతయు నిష్ప్రయోజనంబును మూల్యశూన్యంబునైయుండును. అట్టివాడెట్టిపనిని జేయబూనడు. జడపదార్థములకును వానికిని భేద మిసుమంతయు గానరాదు. ఇట్టివారలేదేశమున నెక్కువగనుందురో యాదేశము బొత్తిగా నశించి పోవుననుటకు సందియములేదు. కామము లేనిది కార్యముగాని యర్థముగాని యుండదు. కార్యములేనిది జీవయాత్ర నడువదు. సంపూర్ణసన్యాసులకు బరలోకమబ్బునో యబ్బదో కాని, యిహలోకచ్యుతి మాత్రము సత్యము. అట్టివారికి మోక్షంబు గలుగుననుటయు నమ్ముట కష్టముగనున్నది. దేశమునకును జాతికిని