పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రెండవ ప్రకరణము

బోస్టను పట్టణము - శుశ్రూష

రెండుసంవత్సరములవఱకు బెంజమిను తండ్రికి సహాయము జేయుచు వచ్చెను. తన జ్యేష్ఠభ్రాత జాను ఫ్రాంక్లిను, చిన్ననాటనుండి తండ్రికి పనిలో సహకారియై యుండి, రెండవసంవత్స రాంతమున వివాహమాడి, 'రోడు' దీవికి కాపురమువెళ్లి, సబ్బు, కొవ్వు వత్తులు, తయారు చేయుచుండెను. ఈకారణముచేత, బెంజమినుసహాయము తండ్రికి ముఖ్యావశ్యకమై, తన కిష్టము లేని పనినుండి తప్పించుకొనుటకు మార్గము లేవియు బెంజమినుకు గానరాకుండెను. ఈ సూచనలవల్ల చాల దు:ఖాక్రాంతుడై, యసంతుష్టి జెందినందున, నతడు సముద్రయానము జేయుటకు బ్రయత్నించు నేమోయని భయపడి, యతనికి మనస్కరించిన వ్యాపారమునందు నియోగించుటకు తండ్రి యుద్యుక్తు డాయెను. వడ్రంగులు, తరిమెన పెట్టువారు, కంచరివాండ్రు - వీరియంగళ్లకు తండ్రి కుమారుని గ్రమముగ దీసికొనివెళ్లి, యేవ్యాపారమునం దితనికి మొగ్గుకలదో, దానియం దతనిని బ్రవేశపెట్టి, యోడప్రయాణమును మానిపింపవలెనని తండ్రి యాలోచించెను.