పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యొడ్డున నొక కొయ్యకు బటముయొక్క దారమునుగట్టి, నేనీదుటకు నీటిలో దిగి, యంతరాళమున నెగురుచున్న పటమునుజూచి సంతోషించుచుంటిని. ఎగురుచున్న పటము బట్టుకొని, యీదవలెనను అభిలాషతో నొడ్డునకువచ్చి, దారమును విప్పి, చేతబట్టుకొని, నీటిలోనికి వెళ్లి, వెలికలబండుకొని, చేతులతో దారము బట్టుకొని నందున, నీటిమీద మనోహరముగ లాగబడితిని. నాదుస్తులనవతలి గట్టునకు దీసికొని రమ్మని నా స్నేహితునితోజెప్పి, సునాయాసముగను, చెప్పనలవికాని మనోల్లాసముతోను లాగబడి, సరస్సును దాటితిని" అని తన స్వీయచరిత్ర యందొకచో నీతడు లిఖించియున్నాడు.

నీటిభయము లేక పోవుటకు దోడు, తండ్రి యొక్క వ్యాపారమునందు రోతపుట్టుటచేత సముద్రముపై యాత్రజేయుట యందితని కభిలాష కలిగినందున, తండ్రికి మనోవ్యాకులము విశేషమయ్యె. దైవికముగ, 1715 సంవత్సర ప్రాంతమున, నితని పినతండ్రి బెంజమిను తన జీవిత కాలావశేషము తన యన్నగారివద్ద వ్యయపఱచుటకు నుద్దేశించి, యమెరికా దేశమునకు వచ్చెను. ఇట్లు చేరిన యన్నదమ్ముల కుటుంబములు రెంటికిని స్నేహము కుదుర, సహోదరు లిరువురును కలిసి నొక్కిచెప్పి, చిన్ని బెంజమినునకు సముద్ర ప్రయాణమందలి యుత్సాహమును విఱిచివేసిరి.