పుట:Balavyakaranamu018417mbp.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఊరనుండి వచ్చె. వనమునుంచి, ధనమునుంచి యని యుంచి శబ్దాను ప్రయోగంబుతోఁ గొందఱు వ్యవహరించెదరు. గాని యది సాధుకవి ప్రయోగారూఢంబుగాదని యెఱుంగునది.

12. కంటెవర్ణకం బన్యార్థాది యోగజం బగు పంచమికగు.

రామునికంటె నన్యుండు ధానుష్కుండు లేఁడు. లోభంబుకంటె నితరంబు దోషంబు లేదు. ఇచట షష్ఠియునగు. రామున కన్యుండు ధానుష్కుండు లేఁడు. అన్యము - ఇతరము - పూర్వము - పరము - ఉత్తరము ఇత్యాదు లన్యాదులు.

13. కంటెవర్ణకంబు నిర్ధారణపంచమి కగు.

ఎచ్చట నిర్ధార్యమాణంబు జాత్యాదులచే భేదంబు కలిగియుండు, నచటం బంచమియగు. ఆ పంచమికిం గంటె వర్ణకంబగునని యర్థము. జానపదులకంటె నాగరులు వివేకులు. మానహానికంటె మరణము మేలు.

14. పట్టివర్ణకంబు హేతువులగు గుణక్రియల కగు.

జ్ఞానముఁబట్టి ముక్తుఁడగు - నీవు వచ్చుటంబట్టి ధన్యుడనయితి. ఇచట వలన వర్ణకంబు నగు. జ్ఞానము వలన ముక్తుండగు.

15. శేషషష్ఠికి యొక్కయు నగు.

ఇచట శేషంబనఁగా సంబంధంబు. రాముని యొక్క గుణములు - నా యొక్క మిత్రుఁడు - వానియొక్క తమ్ముఁడు.