పుట:Balavyakaranamu018417mbp.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సర్వనామ ప్రకరణము

24. అన్ని ప్రభృతులు సర్వనామంబులు.

అన్ని - ఇన్ని - ఎన్ని - కొన్ని - పెక్కు - పలు - ఆ - ఈ - నీ - నా - మన - తా సంఖ్యావాచకములు అన్ని ప్రభృతులు. వీనికిం బ్రథమాంతరూపంబు లుదాహరించెద. వీనిలో డుమంతంబులకెల్ల న్యాగమంబు పూర్వోక్తంబును స్మరించునది. బహువచన లకారంబునకు రాదేశంబును, బూర్వాగమంబును బ్రథమా బహువచనంబునకుం బోలె నెఱుంగునది. విశేషాకారంబులు గలిగెనేనిఁ గొండొకచో ద్వితీయవఱకును గొండొకచోఁ దృతీయయం దొక్క రూపంబు వఱకును రూపభేదంబులు వక్కాణించెద. శేషంబూహించునది. అన్ని మొదలగు శబ్దంబులాఱును, ద్విప్రభృతి సంఖ్యావాచకంబులును మహదర్థంబులు బహువచనాంతంబులగు - అమహదర్థంబు లేకవచనాంతంబులగు. ఇందు నీ మొదలగు నాలుగు శబ్దంబులు - సర్వార్థంబులం దుల్యరూపంబు లయియుండును.

మ - అనునది మహదర్థమనుటకు, అ - అనునది యమహదర్థమనుటకు, ప్ర - మొదలగునవి ప్రథమాది విభక్తులకును సంకేతములుగా నిందు గ్రహించునది.