పుట:Balavyakaranamu018417mbp.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాములు, సోములు, వనములు, ధనములు, ధేనువులు, భానువులు.

13. తక్కినవి యుభయంబులు.

మిగిలిన ప్రత్యయము లేకత్వ బహుత్వములకు బోధకములని యర్థము. వనమును - వనములను - వనముచేతను - వనములచేతను - వనముతోడను - వనములతోడను.

14. ఓ యామంత్రణంబునం దగు.

ఓయనుశబ్దము సంబోధనంబునం దగునని యర్థము. ఇది సంబోధ్యవాచకంబునకు ముందే ప్రయోగింపబడును. ఓశబ్దంబు తొఱంగియు సంబోధ్యవాచకంబు ప్రయోగింపవచ్చును. ఓ రాముఁడ - ఓ రాములార - రాముఁడ - రాములార.

15. ఓ శబ్దంబునకుం బురుష నీచ స్త్రీ పురుషామంత్రణంబులందు యి-సి-రి వర్ణంబులు విభాష నంతాగమంబు లగు.

ఓయి రాముఁడ - ఓ రాముఁడ - ఓసి దుష్టురాల - ఓ దుష్టురాల - ఓరి దుష్టుఁడ - ఓ దుష్టుఁడ.

16. ఓరి యోసి మైత్రియందుం గలవు.

ఓరి చిన్నికృష్ణ - ఓసి ముద్దుబాల. ఓయి మొదలయిన వానికి స్వతంత్ర ప్రయోగముం గలదు. సంతతియె యోయి - ఓసిపోవే - ఓరోరి. ఇంకెందుఁబోవచ్చు - వీనికి దీర్ఘంబుం గలదు. ఓయీ విప్రకులావతంస - ఓరీ దుష్టనిశాటులార, ఓసీ ననుఁ జెనకరాకు.