Jump to content

పుట:Baarishhtaru paarvatiisham.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దానికీని? 'ప్రమాదో ధీమతా మపి ' అన్నారు. ఎవళ్ళకైనా వస్తుంది పొరబాటు; ఏమిటి దానికి?

ఒళ్ళో పళ్ళెము తీసి మళ్ళీ బల్లమీద పెట్టాను. అసలు దహించుకుపోతున్న ఆకలికి తోడు వాళ్ళు నవ్వడముతోటే నాకు కోపము వచ్చింది. ఇప్పుడూరుకుంటే ఇంక పరాభవముగా వుంటుందనుకుని మళ్ళీ యింకో రొట్టెముక్క చేత్తో తీసుకుని దేవుడిచ్చిన చేతులుండగా ఈ వెధవ కత్తులూ అవీ ఎందుకూ, మనయిష్టము వచ్చినట్టు తింటే వాళ్ళేం కొడతారా, తిడతారా అని నా స్వతంత్రము తెలియపరచడానికి ఆ రొట్టెముక్క వెన్నలో అద్దుకుని కొరుక్కు తినడము మొదలు పెట్టాను. నాపక్కనున్న అతను వద్దని సలహా యిస్తూనే వున్నాడు. కాని నేను లక్ష్యపెట్టలేదు. అదివరదాకా నవ్వుతున్న తక్కినవాళ్ళంతాను, వాళ్ళకేదో నేను మహాపకారము చేసినట్లు నాకేసి కోపముగా చూడడము మొదలు పెట్టారు, చూస్తే నాకేమి భయమా? నేనంత కంటే కోపముగా వాళ్ళకేసి చూసి నాపని నేను కానిచ్చాను.

రెండు ముక్కలు నోట్లో పెట్టు కున్నాను. అవింకా పూర్తిగా గొంతుకు దిగాయో లేదో మూడోసారి నోట్లో పెట్టుకుందా మని చెయ్యెత్తాను. కడుపులో చెయ్యిపెట్టి కలిపినట్టు కలవరము బయలుదేరి, పెద్ద తాడిలావున డోకు వచ్చింది. చటాలున చేతిలో రొట్టెముక్క కంచములో పారవేసి నోటికి చెయ్యి అడ్డుపెట్టుకుని లేచాను. ఎక్కడికి వెళ్ళడానికీ, ఏమి చెయ్యడానికీ తోచలేదు. అంతకంతకు లోపలినుంచి ఊరికే పెల్లగిలి వస్తున్నది; ఆపడానికి శక్యము కావడము లేదు, ముందు గదిలోనుంచి అవతలికి పోదామని గుమ్మముకేసి రెండడుగులు వేశాను. లోపలినుంచి వస్తున్న ప్రవాహము నాచేతి నవతలికి తోసి కొంత బయటపడ్డది.