పుట:Baarishhtaru paarvatiisham.pdf/86

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మళ్ళీ చెయ్యి అడ్డు పెట్టుకున్నాను. ఒక నౌకరు నా అవస్థచూసి చటుక్కున దగ్గిరికి వచ్చి నారెక్కపట్టుకొని ఒక గదిలోకి లాక్కుపోయినాడు.

అక్కడ రైలులో మొహము కడుక్కోడానికి ఉన్నట్టుగానే ఏర్పాటున్నది. పూర్తిగా వాంతి అయింది. గడచిన దినమంతా తిండి లేకపోయినా అంత పదార్థ మెక్కడినుంచి వచ్చిందో కాని వారముదినములు తిన్నంత వెళ్ళిపోయింది. నోరూ చెయ్యీ శుభ్రముగా కడిగివేసుకున్నాను. కడుపులో పేగులన్నీ నొప్పులుగా ఉన్నాయి. తల బద్దలవుతున్నది. కండ్లు తిరుగుతున్నాయి. కండ్లు తెరిస్తే ప్రపంచమంతా గిర్రున తిరిగిపోతున్నట్టున్నది. కాళ్ళు తేలిపోతున్నాయి. కింద పడిపోతా నేమోనని భయము వేసింది.

నన్ను తీసుకువచ్చిన నౌకరింకా అక్కడనే ఉన్నాడు. మళ్ళీ నన్ను చెయ్యి పట్టుకుని తిన్నగా ఇంకో గదిలోకి తీసుకువెళ్ళాడు. గది చాలా చిన్నది. కాని అందులో ఒక చిన్న మంచమున్నది. దానిమీద శుభ్రమైన పరుపువేసి పక్కవేసి ఉంది. దానిమీద పడుకోమన్నాడు. అక్కడిదాకా ఎలా నడిచివచ్చానో నాకే తెలియదు. ఈ పరుపు పాపము ఎవరిదోను? ఎలాగో తంటాలుపడి హాలులో కుర్చీలో కూర్చుంటాను, లేకపోతే ఎక్కడైనా స్థలము చూపిస్తే నామంచము వేసుకుని పడుకుంటాను, అని చెపుదామనుకున్నాను. కాని నోటివెంట మాట రాలేదు. గదిలో వస్తువులేవీ కనపడడములేదు. మాట్లాడకుండా తాగివున్న వాడికి మల్లే మంచముమీద పడ్డాను. కాలిజోడైనా విప్పుకోలేదు.

ఇదంతా భోజనముదగ్గిర కూర్చున్నవాళ్ళ దృష్టిదోషము