4
ప్లాటుఫారముమీద పోర్టర్లు, 'తూత్తు కుడై' అని కేకలు వేస్తున్నారు. కొలంబో పోయే వాళ్ళంతా ఇక్కడ దిగండి అని కొందరు కేకలువేశారు. సెకండు క్లాసులోనుంచి దిగేసరికి దర్జాగా వుండాలని నేను కొత్త సూటు తొడుక్కుని ఎర్రసిల్కు తలగుడ్డ చుట్టుకుని చెన్నపట్నంలో కొన్న దొరసాని టోపీమట్టుకు రైలులో విడిచిపెట్టి తక్కిన సామాను తీసుకుని పెట్టెలోనుంచి దిగాను. కూలివాడొకడు వచ్చి సామాను తీసుకుంటానన్నాడు. సరేనని నేను వాడితో బేరమాడి ముందుకు సాగాను. గేటుదగ్గిరికి వెళ్ళడంతోటే టిక్కట్టు కలెక్టరు చూసి, అలా దయచేయండని దారి చూపించాడు. అలా వెళ్లే టప్పటికి అక్కడొక పెద్దమనిషి సామాను చూపించమన్నాడు. కూలివాడి నెత్తిమీదవుంది, కనబడడం లేదా' అన్నాను. అలాకాదు పెట్టితీసి చూపించాలన్నాడు. మీరు కొలంబో ఎందుకు వెళుతున్నా రన్నాడు. నాగుండె బద్దలయించి. ఇంటి దగ్గర చెప్పకుండా వచ్చిన సంగతి వీడి కెలా తెలిసిందా అనుకున్నాను. అయినా కొంత ధైర్య స్థైర్యములు కలవాడిని గనుక వెర్రిమొహము వేయకుండా, ఎందుకయితే నీ కెందుకన్నాను. సరే పోనీలెండి నా కక్కరలేదు, కాని సామాను మట్టుకు చూడక తప్పదన్నాడు. ఎందుచేత నన్నాను. ఇక్కడ రూలది అన్నాడు.