పుట:Baarishhtaru paarvatiisham.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వాళ్ళు కొంత మంది దొంగలకు ధనాపేక్ష చేత సహాయు లవుతారని ప్రతీతి. కొంతమంది అన్యాయ వర్తనులైన మేజెస్ట్రీటులు, ముద్దాయిల దగ్గిర లంచము పుచ్చుకుని కేసులు కొట్టి వెయ్యడము మామూలని వినికిడి. రిజిస్ట్రారాఫీసులో పదిరూపాయల నోటు జూపిస్తే నిముషములో మన పని అయి యివతల పడతాము. అనవసర ప్రశ్నలేమీ లేకుండా. పి.డబ్లియు వారికి వాళ్ళ మామూళ్లు ఇచ్చేస్తే కాలవకు ఎన్ని గండ్లు కొట్టుకున్నా వారికి కనపడవు.

ఇదంతా గ్రహించి ఏదో గార్డు పేదవాడు, కుటుంబీకుడు, మన బోటివాళ్ళొకరూపాయి ఇవ్వకపోతే వారి కెవళ్లిస్తారు గనుక, జీతము రాళ్ళతోటి సంసారము జరగడమెల్లాగా, ఇంతకీ మనకేదో సదుపాయంకూడా చేశాడని కొంచము ముందువెనుకలూ, కష్టసుఖాలు ఆలోచించేవాణ్ణి గనుక, పోబోతున్న గార్డుని పిలిచి, ఒక రూపాయి యిచ్చాను.

తీరా చెయ్యి జారినతరువాత వాడేమనుకుంటాడో కదా, వాడి స్వభావము తెలియకుండా యిచ్చాను. మనకేమి తంటా వస్తుందోను. పోనీ ఇచ్చినవాళ్ళము ఇంకొక రెండు రూపాయలన్నా ఇవ్వకుండా ఒక్క రూపాయే ఇచ్చాము. అధిక్యతవల్ల దోషము లోపిస్తుందేమో నని పరిపరివిధాల మనసు పశ్చాతాప పడడము మొదలు పెట్టింది. ఆ గార్డు నాకేసి ఒకసారి చూసి, ఒకసారి రూపాయకేసి చూసి, మాట్లాడకుండా జేబులో వేసుకుని నవ్వుకుంటూ చక్కా పోయినాడు.

ప్రపంచ మింతే కదా అనుకున్నాను. వీడేమన్న అనుకుం