పుట:Baarishhtaru paarvatiisham.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చెన్నపట్నము మొత్తముమీద చాల పెద్ద ఊరూ, అందమైన ఊరూను. ఆ రోడ్ల వైశాల్యము, షాపుల సౌందర్యము, అంతా చూసి చాలా సంతోషించాను. ఓహో ఎంతపట్టణ మనుకున్నాను. ఇంగ్లండులో ఇంత గొప్ప పట్టణా లుంటాయా, లండ నింతకంటే పెద్దదా, చిన్నదా? అని ఆలోచించాను. అయినా పెద్దదెలా అవుతుంది? ఇంగ్లండు చిన్న ద్వీపము కదా, ఇంగ్లండంతా కలిపి చెన్న పట్నమంత ఉంటుందేమో అని అలా తర్కించుకొంటూ నిమ్మళంగా బండిలో ఊగిసలాడుతూ వెడుతుండగా ఒక చోట 'పెరీజయన్ హేర్ కట్టింగ్ సెలూన్ ' అని కనపడ్డది. పుట్టు వెంట్రుకలు తీయించుకో వలసిన అవసరం వుంది కదా అనుకుని బండి ఆపమని దిగాను. దిగి గుమ్మము దగ్గిర నిలుచుని లోపలికి తొంగిచూశాను. కాళ్ళు ముందుకు సాగలేదు. గుండెలు గబగబా కొట్టుకోడ మారంభించినయి. ఇదివర కెప్పుడూ, నేను భోజనా నంతరము క్షౌరము చేయించుకో లేదు. నేటి కది సంప్రాప్త మయింది. పైగా ఈ బట్టలతోటి చేయించుకోడము, స్నానమైనా చేయకుండా అన్నీ ముట్టుకోడము, ఇదంతా మనసుకు చాల కష్టము తోచింది. ఏమి చెయ్యను, తప్పుతుందా. ఇదంతా ఊరికే తుంటరితనము కోసము కాదు కదా. దేశోపకారము కోసము కదా యింత తలపెట్టింది, ఇటువంటి కష్టములెన్ని లేకుండా కార్య సాధన అవుతుందా అని మనసుకు సమాధానము చెప్పుకున్నాను.

లోపలికి తొంగిచూస్తే నాకు బహు ఆశ్చర్యము వేసింది. గదంతా పరిశుభ్రముగా అద్దములాగా ఉంది. పైన ఎలక్ట్రిక్ దీపాలూ, గోడలో కమర్చి తెల్లని పెద్ద పింగాళి గిన్నెలూ,