పుట:Baarishhtaru paarvatiisham.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నన్ను ఎగాదిగా చూసి 'టిక్కట్టు ఇచ్చే ఆయన ఇంకా రాలేదు. కాస్సేపు ఉండ ' మన్నాడు.

కొంచం సేపైన తరవాత ఆయన వచ్చినట్లు తెలుసుకొని వెళ్ళి టిక్కట్టు ఇమ్మన్నాను. ఆయన కూడా 'ఎక్కడికి ' అన్నాడు.

'చెపుతాలెండి, టిక్కట్టు ఇవ్వండి.'

'ఏమయ్యా ఈ అళవు! యా వూరు పోతావయ్యా?'

'నే నేవూరు వెళ్ళితే మీకెందుకు? టిక్కట్టు ఇవ్వండి.'

దగ్గిర ఉన్న వాళ్ళందరూ నవ్వడము మొదలు పెట్టారు.

'ఇది ఎక్కడయ్యా! వట్టి నాటుపురము మాదిరి ఉండావే!

నీవు ఎక్కడ పూడ్చేది చెప్పకపోతే టిక్కట్టు ఎష్ట్లదా ఇచ్చేదయ్యా? పో అయ్యా, బుద్ధి లేదువలే ఉంది. వాండ్లంతా కాచుకున్నారు ' అని కేకలు వేశాడు.

దగ్గిర ఉన్నవాళ్ళంతా నన్ను మందలించారు.

'ఈ రైలు చాలా దూరము వెడుతుందండి; చాలా చోట్ల ఆగుతుంది. అందుచేత ఏ వూరు మీరు వెళ్ళాలో చెపితే ఆ వూరుకే టిక్కెట్టు ఇస్తారు' అని ఒక పెద్ద మనిషి నిమ్మళంగా హితోపదేశము చేశాడు.

ఆయన చెప్పిన మాటలు నాకు సబబుగానే ఉన్నట్టు తోచింది. అందుచేత టిక్కట్టు యిచ్చే ఆయనతోటి 'చెన్నపట్టణము వెళ్ళాలి' అని చెప్పాను.

అనేసరికి కండ్లెర్రజేసి 'ఎన్న అయ్యా యిది, ఈ పొద్దు ఎక్కడ వచ్చావయ్యా, వట్టి జంతువలె వుండావు! పో అయ్యా! జల్ది పో అయ్యా! వాళ్ళంతా కాసుకొన్నారు.