పుట:Baarishhtaru paarvatiisham.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పొమ్మంటే ఏందయ్యా అట్లా మూతి పెట్టి సూస్తావు? పట్నంబండి సాయంకాలం వరకూ రాదయ్యా, అప్పుడుదాకా యెక్కడనైనా పండుకొని తూంగు అయ్యా' అన్నాడు.

నా దగ్గిర వాళ్ళంతా నన్నవతలికి తోశేశారు. పోనీ కొంచెము సమ్మర్దము తగ్గిన తరువాత మళ్ళీ వద్దామని వెళ్ళాను. రైలుకు కాబోలు గంట కొట్టారు. అప్పుడు మళ్ళీ వెళ్ళి 'పట్నం బండి ఎప్పుడు వస్తుందండీ' అన్నాను.

'సాయంకాలము ' అన్నాడు ఆయన.

'అలాగా, సాయంత్రము దాకా వుండాలా! నాకు తొందర పని ఉందే!'

అప్పుడు నా మొఖము కేసి చూసి 'ఓ! తిరిగి వస్తివా! తొందరపని ఉంటే నడిచిపో ' అని కిటికీ తలుపు వేసుకుని చక్కా పోయినాడు, మాష్టరు.

నా మీద కోపముచేత ఇలా అంటున్నాడేమో, ఈసారి నెమ్మదిగా అడిగి నిజము తెలుసుకొందామని ముందుకు వెళ్ళి ఎదురుగా నిలబడి మాట్లాడుదామని నోరు తెరిచేసరికి ఆయనే, 'వస్తివా, పట్నంబండి ఎప్పుడు వచ్చేదీ తెలుసుకొనే దానికి వస్తివా! ఒకసారి చెపితే నీకు బుద్ధి లేదూ! అని ఆరంభించాడు. అసలే అరవవాళ్ళంటే నాకు కోపము, అందులో ఆయన ముఖము స్ఫోటకము మచ్చలతోటి నల్లగా మరీ అసహ్యంగా వున్నది. నే నూరికే తెలియని విషయము నెమ్మదిగా అడుగుతూ ఉంటే ఆయన అంత మర్యాద తెలియకుండా మాట్లాడుతా డేమని నాకు కోపం వచ్చింది. 'నేను ఇంగ్లండు వెడుతున్నాను, జాగ్రత్త!' అని చెబుదా మనుకొన్నాను. కాని ఆయనను ఇంతకంటే ఏడిపిస్తే బాగుండదని తోచింది. అందుకని 'అబ్బే నేను రై