పుట:Baarishhtaru paarvatiisham.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4

దొరకదుకదా! రొట్టెలు కాల్చుకు తినవలసిందే గనుక కొంత గోధుమ పిండి; కొంచెము నెయ్యి! రొట్టెలో నంచుకోడానికి కొంచెము ఆవకాయ, రొట్టెలు కాల్చుకోడానికి చిన్న అట్లపెనము; స్టవ్, స్టవ్ లో పోసుకోడానికి కిరసనాయిలు, చిన్న సీసాలో స్పిరిటూ. భోజన సామగ్రి అయిన తరువాత పడకకు కావలసిన సామాన్లను గురించి ఆలోచించాను. వెళ్ళేది చలి దేశం కదా; కింద పడుకోడానికి కష్టముగా ఉంటుందని నర్సారావుపేట మడతమంచము; దానిమీద పక్కకి నేను మామూలుగా ఉపయోగించుకొనే బొంత--ఇంట్లో కుట్టినది--కప్పుకోడానికి నారింజపండు రంగు శాలువ.

ఇవిగాక యింకా ఏమి అవసర ముంటవని ఆలోచించగా మామూలుగా పగలు కూర్చోడానికి తుంగచాప తీసుకుని వెళ్ళితే బాగుంటుందని తోచింది. అక్కడికి వెళ్ళినా హిందూధర్మ విరుద్ధంగా ప్రవర్తించ దలుచుకోలేదు గనుక అక్కడ దొరకవనే భయముతో ఆరు యజ్ఞోపవీతాల జతలూ, మూడు పట్టు మొలతాళ్ళూ కూడ తీసుకొని వెళ్ళడము చాలా అవసరమని తోచింది. ఇంక ఎంతసేపు ఆలోచించినా తీసుకొని వెళ్ళవలసిన వేవీ కనపడలేదు. ఇదంతా చూసి కొందరికి చాదస్తముగా కనబడవచ్చు. కాని వెళ్ళేది దూరదేశము. ఏ చిన్న వస్తువు మరచిపోయినా అక్కడ ఇబ్బంది పడవలసి వస్తుందని, మొదటి నుంచీ ఎక్కువ జాగ్రత్త కలవాడిని కనుక చాలా దూరాలోచన చేసి ఇవన్నీ తీసుకొని వెళ్ళాను. ఇంక ఈ వస్తువులన్నీ పెట్టుకోడానికి ఎక్కడయినా కూలివాడు దొరికినా దొరకకపోయినా, నేను తీసుకు వెళ్ళడానికి తేలికగా ఉంటుందని, చిన్ని సీనా రేకు పెట్టె చేయించి చక్కని బంతిపూవు రంగు వేయించాను.