పుట:Baarishhtaru paarvatiisham.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లలో బాగానే వుండేది. మంచి గడియారమేనని సంతోషించాను. కాని పోను పోను, పగలంతా బాగా వుండి రాత్రి దానికేమి వచ్చేదో కాని తెల్లవారే సరికి రోజూ పావుగంట తక్కువ తిరిగేది. ఇలా వాతం కమ్ముకు రావడానికి తగ్గ కారణం ఏమీ కనుపించదు. పోనీ ఒకరోజైతే అనుకోవచ్చును. అనుదినమూ ఇలా వెనుకంజ వెయ్యడముచూసి నాకు ఒళ్ళుమండుకొచ్చింది. ఆయన రెండున్నరా దూటబిళ్ళలులాటివి తీసుకుని ఇలాటి గడియారము నాకిచ్చాడేమా అనుకున్నాను. దొరలుకూడ వీలైనప్పుడు మోసం చెయ్యడానికి వెనుదీయరని తేలింది. ఈ వెధవ గడియరం కూడా తీసుకువెళ్ళడ మెందు కనుకున్నాను. చూసి చూసి పారెయ్యడానికి ప్రాణం ఒప్పలేదు. సరే ఏదో పోనీ ఒక అరగంట యించుమించుగా తిరుగుతోందిగదా, అసలు లేని బావకంటె గుడ్డిబావైనా మేలనుకుని పారవేయడము మానేసి పెట్టిలో పెట్టాను.

తరువాత ఒకనాడు తెల్లవారేసరికి ఈ సముద్రపు హడావిడి తగ్గింది. దొర చీకటితోటే వచ్చి నన్ను లేపి, ఇవ్వాళే దిగిపోవడము. బెంగెట్టుకోకు. ఇంకో గంటకో రెండు గంటలకో దరి చేరుతాము. భూమి కనబడుతోంది. లేచి కాస్త ఫలహారముచేసి పైకి వెళ్ళి చూడమని ఎంతో ఆదరంగా చెప్పాడు. ఈ నాలుగైదు రోజులూ తిండిలేకపోవడము మూలాన్ని చిక్కి శల్యమైపోయాను. ఒంట్లో చాలా నీరసంగా వుంది. లేస్తే కాళ్లు దడ దడ లాడుతున్నాయి. అలాగే లేచి దంత ధావనము చేసుకొని చొక్కాలు తొడుగుకుంటూవుంటే, ఆ దొర నాగదిలోకే ఫలహారము పంపించాడు. కాస్తంత తిని నిమ్మళంగా పైకెక్కాను. సుమారు ఎనిమిది గంటలవుతుంది. ఆకాశం నిర్మలముగా వుంది. సముద్రము ఎంతో