పుట:Apoorva Brahmacharya Prahasanamu - Kandukuri Veeresalingam.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అపూర్వబ్రహ్మచర్య ప్రహసనము 17

మోహి -- మాఅమ్మ వస్తూవున్నదా?

వెంక -- యేఅమ్మ గారా? యేలినవారి భార్యాగారు. శ్యామలాంబగారు. నేను వెళుతూవుండగా అమ్మగారిబండి యెదురుగావస్తే నేను వెనక్కు పరుగెత్తుకొని వచ్చినాను.

కర -- ఇక నేను బ్రతికినాను. నాకు మళ్ళీ ప్రాణాలువస్తూ వున్నవి.

రామా -- మీరు యీ ఆకులూ అన్నీ తీసి వెయ్యండి. వేగిరం కరటకా! నీవీదొడ్డితలుపుతీసి మోహినిని యింటికి పంపించివెయ్యి. (అని తలుపువద్దకు పరుగెత్తుకొనిపోయి) ఈపెరటితలుపు తాళము వేసియున్నది. కరటకా! తాళంచెవి యేదీ?

కర -- తాళంచెవా?

రామా -- అవును, తాళంచెవి వేగిరం ఇయ్యి.

కర -- (దేహము తడువుకొనుచు) తాళముచెవి పోయింది.

రామా -- అయ్యో! ఇప్పుడేమిచెయ్యను? నాకు అసాధ్యం వచ్చినది. నాభార్య బండిదిగి వస్తూవున్నది. కరటకా! నీవీచిన్న దాన్ని యిప్పుడీవసారాలోకి తీసుకొనివెళ్లు. నేనుయెదురుగా వెళ్ళి నాభార్యను తీసుకొనివస్తాను.

కర -- మంచిది. (అని మోహినితో వసారాలోకి పోవుచున్నాఁడు.)

[అప్పుడు శ్యామలాంబప్రవేశింపఁగా, రామాకాంతముపంతు లెదురుగాపోవుచున్నాఁడు. మోహినిని విడిచి కరటకరెడ్డి వచ్చు చున్నాఁడు.]

శ్యామ -- ఓప్రాణేశ్వరా! మీకు తెలివివచ్చినదా? నేను మిమ్మల్ని చూడనేమోనని యేడుస్తూవచ్చినాను.