Jump to content

పుట:AntuVyadhulu.djvu/95

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

76

ఎనిమిదవ ప్రకరణము


ఇందు మొదటిరకము అంటువ్యాధులలో సూక్ష్మజీవులే మన కపకారము చేయును. రెండవరకము అంటువ్యాధులలో సూక్ష్మజీవులనుండి పుట్టిన విషములు మన కపకారముచేయును. దొమ్మ (Anthrax) క్షయ (Tubercle), కుష్ఠము (Leprosy), మొదలగునవి మొదటిరకములోని అంటువ్యాధులు. ధనుర్వాయువు (Titanus), కలరా (cholera), డిప్తిరియా (Diphtheria) అనునొక క్రూరమైన గొంతువ్యాధి, ఇవి రెండవరకము అంటువ్యాధులు. ఈ రెండురకములుగాక కొంతవరకు సూక్ష్మజీవుల మూలమునను కొంతవరకు వాని విషముల మూలమునను మన కపకారముచేయు అంటువ్యాధులు కొన్నిగలవు. టైఫాయిడు జ్వరము, ప్లేగు,(మహామారి); ఇౝప్లూయంజా జ్వరము, రణజ్వరము (Septic Fever) ఇవి యీ మూడవజాతి అంటువ్యాధులు.

ఇందు మొదటిరకము వ్యాధులలో రక్షణశక్తి కలిగింపవలెననిన, సూక్ష్మజీవులను జంపుటకు ప్రయత్నింపవలెను. అట్లు చంపుపదార్థములకు సూక్ష్మజీవనాశకములని పేరు. ఈ సూక్ష్మజీవనాశకములగు పదార్థములను మన మేలాగుననైన రోగి శరీరములో పుట్టించినయెడల ఆ పదార్థములు సూక్ష్మజీవులను చంపును. మశూచకము మొదలగు వ్యాధులు రాకుండ టీకాలువేయుట ఈ పదార్థములను మన శరీరములో బుట్టించుటకే. ఇట్టి టీకాలలో అనేక విధములుగలవు. వానిని క్రింద వివరించెదము.