ఆరవ ప్రకరణము
పరాన్నభుక్కులు. (Parasites).
ఇతరుల శరీరములలో నివసించుచు తమ పోషకుల యొక్క ఆహారాదులయందుపాలుగొని జీవించు నొక జాతి జంతువులకు పరాన్నభుక్కులనిపేరు. ఇందు కొన్ని తమ పోషకులకే వ్యాధినిపుట్టించును.
ఇవి సూక్ష్మజీవుల జాతిలోనివికావు. వానితో పోల్చగా నివి మిక్కిలి పెద్దజంతువులు. వీనిమూలమునకూడ మనదేశము నందు కొన్నివ్యాధులు వ్యాపించును. అందులో మిక్కిలి తరుచుగానున్న గజ్జిని బూదకాలును పుట్టించు పరాన్నభుక్కులను గూర్చి కొంచెము వివరించెదము.
మగ గజ్జిపురుగుల కంటె ఆడువి రెట్టింపుపెద్దవి. 22-వ పటము చూడుము. వీనికి రెంటికిని ముట్టెలవలెనుండు కాళ్లు నాలుగు ముందువైపునను, ముండ్లవలెనుండుకాళ్లు నాలుగు వెనుక వైపునను ఉండును. పురుషాంగములు మగదాని వీపుమీదను, స్త్రీయంగములు ఆడుదాని పొట్టమీదను నుండును. మగది చర్మముపైతట్టున తిరుగులాడుచుండును. అడుది లోలోపలికి దొలుచుకొనిపోవుచు తాను బోవుమార్గమున దినమున కొకగ్రుడ్డు పెట్టుకొనుచుండును.