పుట:AntuVyadhulu.djvu/228

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

201

చుక్కల వలె నుండు న్యూమో కాకస్ అను నొక విధమైన సూక్ష్మ జీవులచే కలుగు చున్నది. అధికమైన చలిగాలో గాని రాత్రులయందు మంచులో గాని వానలో గాని తిరిగిన వారికి వెంటనే ఇది అంటు కొనును. ఈ సూక్ష్మ జీవి ఆరోగ్యముగా నుండు వాని యుమ్మిలో గూడ సాధారణముగ కనబడుచుండును. ఏ కారణము చేతనైనను శరీరము యొక్క రక్షణ శక్తి తగ్గినపుడు ఈ సూక్ష్మ జీవి ఊపిరి తుత్తులలో ప్రవేశించి వ్యాధిని పుట్టించును. న్యూమోకాకస్ ఇన్ ప్లూయంజా, ప్లేగు టైఫాయిడ్ సూక్ష్మ జీవులు కూడ ఒకానొకప్పుడు ఒక విధమైన న్యూమొనియాను కలిగింప వచ్చును.

అప్పుడు ఊపిరి తిత్తులలో ఆయా సూక్ష్మ జీవులు ప్రత్యేకముగ గాని, న్యూమో కాకస్ తో చేరిగాని ఉండును. పల్లెటూరి వారికన్న పట్టణ వాసులు రెండింతలు అధికముగా బాధ పడుదురు.

పట్టణ వాసులకు న్యూమోనియా భయము పల్లెలలో వారి కంటే హెచ్చుగ నుండును. అన్ని వయసుల వారికిని సామాన్యముగ ఒకటే విధముగా నంటును. కాని బిడ్డలకు అంటి నపుడు మరణములు హెచ్చుగ నుండును. ఇంటిలో నుండు ఆడవారి కంటే బయట వెళ్ళి వ్యవహరించు మగవారికి ఈ వ్యాధి హెచ్చుగ అంటును. అధికాయాసములు, వీధులలోని దుమ్ము, చలిగాలి, తడి, ఇవన్నియు ఈ వ్యాధి యొక్క వ్యాపకములకు సహకారులగు చున్నవి.