పుట:AntuVyadhulu.djvu/193

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

168

(4)వాహనములు: ఒక గ్రామము నందు గాని ఒక ఇంటి యందు గాని కలరా సూక్ష్మ జీవి ప్రవేశించిన తర్వాత ఒకరి నుండి మరియొకరికి ఈ వ్యాధి అంటు కొనుటకు ఏదో యొక విధమైన వానములు కావలెను. ఇందు ముఖ్యమైనవి.....

(1) మంచి నీళ్లు: మంచి నీళ్ల చెరువులలో గాని నూతులలో గాని ఇది ప్రవేశింప గలిగిన యెడల గుప్పున అనేక మందికి ఒక్కసారె అంటు కొనును. పెద్ద పట్టణములలో, పట్టణమునకు దూరమున నుండు చెరువులలో నుండి నిర్మలమైన నీటి గొట్టముల ద్వారా తెప్పించు కొను చోట్ల కలరా వ్యాధి మిక్కిలి అరుదుగ నుండును. కావున మంచి నీళ్లన్నిటి కంటె ప్రధమ వాహనము.

(2)ఆహార పదార్థములు, పండ్లు,. పాలు: ఇవి కలరా సూక్ష్మజీవుల వృద్ధికి తగిన పురిటిండ్లగుటయే గాక దీని నొకరి నుండి మరియొకరికి వ్యాపింపచేయు సాధనములుగా కూడ వున్నవి.

(3) జంతువులు: ఈగలు, దోమలు మొదలగు పురుగు కూడ దీనికి మిక్కిలి సహయము చేయును. అందు ముఖ్యముగ ఈగ కడుపులో పదునాలుగు దినములు ఈ సూక్ష్మజీవి నివశించి యుండిన పిమ్మట కూడ ఇతరులకు ఈ సూక్ష్మజీవి వ్యాధిని పుట్టింప గలదని ఇపుడు స్పష్టముగా రుజువు పడినది. ఇది తన కాళ్ల మీదను రెక్కల మీదను ఎట్లు సూక్ష్మ జీవులను జేర వేయ గలదో ఇదివరకే చూచియున్నాము.