పుట:AntuVyadhulu.djvu/192

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

167

వీనికి తగిన సదుపాయమున్న గాని ఇవి నాటుకొన నేరవు. ఈ సూక్ష్మ జీవి ప్రయాణమునకు ముఖ్యమైనవి మూడు కాన వచ్చుచున్నవి. (1)మానవుల రాక పోకల మార్గములు. (2) నదులు, కాలువలు, మొదలగు ప్రవాహములు. (3) ఓడలు, పడవలు, రైళ్ళు మొదలగునవి.

(1) మానవులు: తీర్థ యాత్రలకు పోయిన ప్రయాణికులు తిరిగి వచ్చు నపుడు మార్గము నందు ఊరూరునకు కలరాను చేర వేయునది మనమెరిగిన విషయమె. రైలు వచ్చిన తరువాత ప్రయాణములు సులభమగుటచే మునుపటి కంటె ఈ వ్యాధి ఇపుడు మిక్కిలి వేగముగ వ్యాపించు చున్న దనుట స్పష్టము.

(2) ప్రవాహపు నీరు: ఒక నదిలో పడిన మైల దాని కిరుపక్కల నుండు పట్టణముల కెల్ల పంచి పెట్టు కొనుచు పోవును. కావుననే చుట్లు పట్ల నున్న గ్రామాదులలో కలరా లేక పోయినను ఒక కాలువగట్టున ఉన్న అనేక గ్రామములలో కలరా వ్యాధి ఒకేసారి వ్యాపించు చుండును.

(3) ఓడలు, పడవలు మొదలగునవి: వీని మీద ప్రయాణము చేయు మనుష్యుల మూలమున వచ్చు వ్యాధిని గూర్చి పైన వ్రాసి యున్నాము. అది గాక కలరా సూక్ష్మజీవులచే మైల పడిన సామానులు ఒక దేశమునుండి మరియొక దేశమునకు పోవుటచే ఇక్కడనుండి అక్కడకు కలరాను జేరవేయ వచ్చును.