Jump to content

పుట:AntuVyadhulu.djvu/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2

మొదటి ప్రకరణము

ఇదిగాక కలరా మొదలగు కొన్ని వ్యాధులు ఇతరుల కంటిన తరువాత కొన్ని నిమిషములలోనే తమ లక్షణములను సూచించును. క్షయ మొదలగు మరికొన్ని వ్యాధులంటిన తరువాత వాని లక్షణములు బయలుపడుటకు ఒక్కొక్కసారి కొన్ని సంవత్సరములు పట్టును. ఈ కారణమును బట్టికూడ నీవ్యాధులు అంటువ్యాధులని ప్రజలు తెలిసికొనుట కంతగావీలు లేదు.

అంటువ్యాధుల కన్నిటికిని కొన్ని సామాన్య లక్షణములు అనగా పోలికలు గలవు. వీనిని బట్టి యేవి అంటువ్యాధులో యేవికావో శోధకులు గ్రహింపగలరు. అంటువ్యాధులను వ్యాపింపజేయు విత్తనములు చెట్ల విత్తనముల బోలియుండును. సెనగమొక్కలు గింజనుండి మరునాటికే మొలచును. తాటి మొక్కలు చాల దినములకుగాని బయటపడవు. ఇట్లే అంటువ్యాధుల విత్తనములు మన శరీరములో ప్రవేశించిన తరువాత వాని జాతిభేదములనుబట్టి ఆ యా వ్యాధులు బయట పడుటకు వేరువేరు కాలములు పట్టును. అంటువ్యాధుల కన్నిటికి ఒక్కొక వ్యాధిని వ్యాపింపచేయుటకు ఒక్కొక జాతి విత్తనము కలదు. వృక్షములలో వేపచెట్టు, మఱ్ఱిచెట్టు రావిచెట్టు, చింతచెట్టు, మొదలగు చెట్లకు ఒక్కొక చెట్టునకు ఒక్కొక జాతి విత్తనములు పుట్టి అవి పోయి వేరొకచోట మొలచి ఆయాజాతి చెట్లను ఎట్లు వృద్ధిచేయునో, అట్లే అంటువ్యాధులును తమ తమ విత్తనముల మూలమున వ్యాప్తిని జెందును. ఒక వ్యాధిని కలుగజేయు విత్తనము ఒక రోగి