పుట:AntuVyadhulu.djvu/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అంటు వ్యాధులు.

మొదటి ప్రకరణము

అంటువ్యాధు లెవ్వి?

మశూచకము, కలరా, చలిజ్వరము, కుష్ఠరోగము (కుష్ఠువ్యాధి), సుఖరోగములు మొదలగు వ్యాధులు ఒకరి నుండి మరియొకరికి అంటుకొనునని సామాన్యముగా మన మందరము వినుచుండు విషయమే. కాని స్ఫోటకము, కలరా మొదలగునవి కొన్ని అనేకమంది కొక్కసారి మిక్కిలి వేగముతో వచ్చి ఒకరినుండి మరియొకరి కంటు తమ స్వభావమును ఎల్లరకును వెలిబుచ్చును. మరి కొన్ని వ్యాధులు ఇంత కంటే తక్కువ తీవ్రమైనవై తమ చుట్టునుండు వారలనెల్ల నంటుకొనక కొందరిని మాత్రమే, కొన్ని సందర్భములలో మాత్రమే అంటుకొనును. ఇంటిలో నొకనికి కుష్ఠరోగముగాని, క్షయవ్యాధి గాని ఉన్నయెడల, ఆవ్యాధి ఆ యింటిలో నందరకు వచ్చుటలేదు. ఏ కారణములచేత నీ వ్యాధులు కొందరను విడిచివేసి యితరులను పీడించునో ముందు తెలిసికొన గలరు. ఇట్లందరకు అంటకపోవుటచేత వాని కంటుకొను స్వభావమున్నదో లేదోయని కొందరు సందేహపడుదురు.