Jump to content

పుట:Annamacharya Charitra Peetika.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

94

కడపజిల్లాలో ముడుంపాడు, ఊటకూరు, మాచనూరు, రాజుపాలెం, ఎఱ్ఱవారిపాలెం అనుగ్రామములోఁగూడఁ దాళ్ళపాకవారు పెదతిరుమలాచార్యుల యయిదుగురు కుమాళ్ళ వంశపరంపరలవారు ఉన్నారట. శ్రీసూర్యనారాయణయ్యగా రాయాగ్రామముల కరిగియక్కడి విశేముల దెలిసికొనివచ్చిరి. మఱి కొన్ని విగ్రహాదులు ముడుంపాడు గ్రామమునఁ గల వని తెలుపఁగా వానిసేకరింపగోరి వారి నాగ్రామమున కంపితిని. కాని వారు విగ్రహముల నీయరయిరట. గ్రంథములు శిథిల మయి పోయినవట. తాళ్ళపాకవారి యిండ్లనుండి (కడపజిల్లా) కొన్నితాళపత్ర గ్రంథము లాంధ్రసాహిత్యపరిషత్తువారు సేకరించిన ట్లున్నారు.

(చూ.6 వాల్యుం. పరిషత్పత్రిక)

నందవరీకులు-వైష్ణవత

అన్నమయ యాదివన్ శఠకోపయతిశిష్యుఁడై వైష్ణవుఁడైనట్టే యాకాలమున నందవరీకబ్రాహ్మణులు మఱికొందఱు వైష్ణవము స్వీకరించి శఠకోప యతిశిష్యులయిరి. అల్లసాని పెద్దనకూడ నందవరీకబ్రాహ్మణుఁడే, స్మార్తుఁడే. శఠకోపయతిశిష్యుఁడై వైష్ణవము పుచ్చుకొన్నాఁడు. ప్రబంధరాజవిజయు వేంకటేశ్వరవిలాసమురచించిన గణపవరపు వెంకటకవికూడ నందవరీకుఁడే. వారి పూర్వులు వైష్ణవము పుచ్చుకొన్నవారే! కాని యాతఁడు తాళ్ళపాకవారికిఁ జాలఁ దర్వాతివాఁడు శ్రీవెంకటేశ్వరస్వామిపై నాతఁడు రచించినకృతి వెంకటేశ్వరవిలాస మాతఁడన్నట్లు ప్రబంధరాజమే. నందవరీకులు గొందఱు వైష్ణవులగుటకుఁ బ్రధానముగా నన్నమాచార్యుఁడే కారణ మనుకొందును ఆరాధ్యశైవుఁడగు తెనాలి రామకృష్ణుఁడు వైష్ణవుఁ డగుటకుఁ గూడ నీతాళ్లపాకవారి పలుకుబడి కలదేమో. అతని కృతిపతి విరూరివేదాద్రిమంత్రి నందవరబ్రాహ్మణుఁడేమో. 'విరూరి' యింటిపేరివారు నందవరీకులు నేఁడున్నారట. రామకృష్ణుని గురువగు కందాడ అప్పలాచార్యుడు తాళ్ళపాక పెదతిరుమలాచార్యునకును గురువు. కాన పెదతిరుమలయ్య రామకృష్ణుఁడు సతీర్థ్యులు.